ప్రతీకాత్మక చిత్రం
లక్నో: అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ జవహార్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ(జేఎన్‌ఎమ్‌సీ) వైద్యులు అరుదైన సర్జరీతో ఓ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను నాలుగు గంటలపాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలిఘర్‌కు చెందిన సల్మాన్ కూతురు మెహిరా అనే 7 నెలల చిన్నారి పుట్టుకతోనే గుండెసంబంధిత వ్యాధితో బాధపడుతోంది. వారు జేఎన్‌ఎమ్‌సీని ఆశ్రయించగా.. వైద్యులు ఆచిన్నారికి పునర్జన్మను ప్రసాదించారు. ఆ పసికందు కడుపులో ఉన్నప్పుడే గుండెకు సంబంధించిన గదులు నిర్మితం కాలేదని, పైగా ఆ గుండెకు రంధ్రం కూడా పడిందని డాక్టర్లు పేర్కొన్నారు.
దీంతో ఆమె రక్తం కలుషితమై నీలి రంగులోకి మారిందని, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. ఆపరేషన్‌తో ఆ చిన్నారి రక్తం తల నుంచి మెడ, చేతుల ద్వారా ఊపిరితిత్తులకు చేరేలా చేశామన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని, డిశ్చార్జ్‌కూడా చేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య లేకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చన్నారు. ఈ ఆపరేషన్ రాష్ట్రీయ బాల్ స్వస్త్యా కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) ద్వారా ఉచితంగా నిర్వహించినట్లు తెలిపారు. జేఎన్‌ఎమ్‌సీలో ఇప్పటి వరకు గుండెకు సంబంధించిన శస్త్రశికిత్సలు చాలా చేశామని డాక్టర్ అజమ్ హసన్ మీడియాకు వివరించారు. సుమారు 80 మంది పిల్లలకు ఆర్‌బీఎస్‌కే ద్వారా ఉచితంగా సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment