
న్యూఢిల్లీ: పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే ఆరోగ్య హెచ్చరికలకు కొత్త వాటిని చేరుస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత తయారైన, దిగుమతి చేసుకున్న, ప్యాక్ అయిన పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై మొదటి సెట్ హెచ్చరికలను, రెండో సెట్ హెచ్చరికలను వచ్చే ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ తర్వాత ముద్రించాలి. వీటి తయారీ, సరఫరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యత వహించే వారు ఈ హెచ్చరికలను ప్యాకేజీలపై ముద్రించాలంటూ సవరించిన ప్యాకేజింగ్, లేబులింగ్ నిబంధనలను ఆ నోటిఫికేషన్‌లో వివరించింది.
వీటిని అతిక్రమించిన వారికి చట్ట ప్రకారం జైలుశిక్ష, జరిమానా ఉంటాయి. ప్యాకేజీలపై ముద్రించాల్సిన హెచ్చరికలు.. ‘పొగాకు వాడకంతో దేశంలో ఏటా 12 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లలో 50 శాతం పొగాకు వల్లే సంభవిస్తున్నాయి. నోటి క్యాన్సర్లలో 90 శాతం పొగాకుతో సంబంధం ఉన్నవే’. ఈ హెచ్చరికలతో కూడిన రెండు చిత్రాలను 12 నెలలకు ఒకటి చొప్పున అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపైన ముద్రించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment