
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దాదాపు మూడు నెలల నుంచీ కర్ణాటకలోని దేవాలయాలను వరుసగా సందర్శిస్తున్నారు. దీంతో ఆయనకు ‘ఎలక్షన్ హిందూ’ అని పేరు పెట్టారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప. ఆయనకు ఈ ఐడియా ఇచ్చింది సోషల్ మీడియా నిపుణులే. ఇలా రాజకీయ ప్రత్యర్థులపై పదునైన అస్త్రాలు సంధించడానికి, ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగించుకోవాలో వారు రాజకీయ పక్షాలకు సలహా ఇస్తున్నారు.
ఫిబ్రవరిలో రాహుల్ కర్ణాటక రావడానికి వారం ముందు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుడులు, గోపురాలు సందర్శిస్తారనే విషయం తెలియగానే పది మంది సభ్యుల సోషల్ మీడియా నిపుణుల బృందంతో యడ్యూరప్ప సమావేశమయ్యారు. ఈ భేటీ ఫలితంగా రాహుల్‌ను ఎన్నికల హిందువని యడ్యూరప్ప ట్వీటర్‌లో పిలవడానికి వీలయింది. అయితే, కాషాయపక్షం దాడికి మాటకు మాటతో కాంగ్రెస్ జవాబిచ్చింది.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల ‘అధ్యయనం’
దేశంలోని 543 లోక్‌సభ సీట్లలో ఓటర్లు సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా గురయ్యే స్థానాలు 160, ఒక మోస్తరు ‘ఇన్‌ఫ్లూయెన్స్’పడే అవకాశమున్నవి 67 ఉన్నాయని ముంబైకి చెందిన నిపుణుల సంస్థ ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్ కిందటేడాది జరిపిన అధ్యయనం తర్వాత తెలిపింది.
ఆన్‌లైన్ ప్రచారానికి ‘పడిపోయే’ ప్రజలను ఓట్లుగా మార్చుకోవడం సాధ్యమా? లేదా? అని చెప్పడానికి ఎలాంటి కొలబద్దా లేదుగానీ కోట్లాది మంది ఓటర్లకు సమాచారం అందివ్వడానికి సమర్థ ఆన్‌లైన్ పనిముట్లుగా ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్వీటర్ అక్కరకు వస్తున్నాయి. ‘‘2013 ఎన్నికల్లో మాకు పడిన 62 లక్షల ఓట్లలో రెండున్నర లక్షలు సోషల్ మీడియా ప్రచారం వల్లే లభించాయి’’ అని జేడీఎస్ సోషల్ మీడియా టీమ్ సభ్యుడు సి.నవీన్ వెల్లడించారు.
ఆర్థిక స్థితిని బట్టి ఓటర్ల వర్గీకరణ
ఓటర్లను ప్రభావితం చేయడానికి ముందు వారి ఆర్థిక స్థితిని బట్టి వర్గాలుగా విభజించి చేరువ కావడానికి అన్ని పక్షాలూ ప్రయత్నిస్తున్నాయని రాజకీయ నేతలు, పార్టీలకు ఓటర్ల గణాంకాలు, విశ్లేషణ, సాంకేతిక పనిముట్లు అందించే సంస్థ ఫోర్త్‌లైన్ టెక్నాలజీస్ డైరెక్టర్ నామన్ పుగాలియా చెప్పారు. భిన్న వర్గాల ప్రజలను భిన్న పద్ధతుల్లో ప్రభావితం చేసే ప్రచార మార్గాలను అనుసరిస్తున్నారని ఆయన వివరించారు. స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే 18–35 ఏళ్ల వయసు యువత ఈ ప్రక్రియను విజయవంతంగా వాడుకోవడానికి తోడ్పడుతున్నారు.
అన్ని పార్టీలకు కలిపి పది నుంచి 20 మంది కీలక సభ్యులున్న సోషల్ మీడియా బృందాలు పనిచేస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే వేలాది మందితో కూడిన వందలాది గ్రూపులను ఈ కీలక బృంద సభ్యులు సమన్వయం చేస్తుంటారు. కాంగ్రెస్ పార్టీ ఆన్‌లైన్ ప్రచారానికి సొంత టీంను ఏర్పాటు చేసుకుంది. పుణెకు చెందిన ఓ కంపెనీ సేవలను జేడీఎస్ వినియోగించుకుంటోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగపడిన రాజ్‌నీతీ పొలిటికల్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ సంస్థనే కాషాయపక్షం కర్ణాటకలో సోషల్ మీడియా ప్రచారానికి ఉపయోగిస్తోంది.
టెక్ నగరంలో పార్టీల కులం బాట..!
ఇండియన్ సిలికాన్ వ్యాలీ, ‘టెక్ నగరం’ బెంగళూరులో ఈ ఎన్నికల్లో కులం, మతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఓటర్ల మనసు గెలుచుకోడానికి కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) ఇదే మంత్రాన్ని జపిస్తున్నాయి. నగరంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఈ మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను కులం, మతం ప్రాతిపదికనే ఎంపిక చేశాయి. బృహన్ బెంగళూరు మహానగర పాలిక(కార్పొరేషన్) పరిధిలో 28 అసెంబ్లీ సీట్లు, నగర శివార్లలో మరో 8 సీట్లు ఉన్నాయి. మూడు, నాలుగు సీట్లు మినహా అన్ని సీట్లలోనూ అభ్యర్థుల కుల, మతాలు ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న శివాజీనగర్, ఛామరాజ్‌పేట నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ రోషన్‌బేగ్, జమీర్ అహ్మద్‌ఖాన్‌ను పోటీకి దింపింది.
ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు అధికంగా ఉన్న శాంతినగర్ నుంచి మరో ముస్లిం ఎమ్మెల్యే ఎన్‌ఏ హారిస్ రీనామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ మంత్రి కేజే జార్జి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వజ్ఞనగర్‌లోనూ ముస్లిం, క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ కావడంతో కాంగ్రెస్ క్రిస్టియన్ అభ్యర్థినే బరిలో నిలుపుతోంది. జసవన్నగుడి, మల్లేశ్వరం, జయనగర, రాజాజీనగర, బీటీఎం లేఅవుట్, బ్యాటరాయనపుర, విజయనగర, గోవిందరాజనగర, మహాలక్ష్మి లేఅవుట్, యశ్వంతపుర నియోజకవర్గాలన్నీ కూడా అగ్రకులాల ఓట్లు అధికంగా ఉన్నవే. దీంతో అన్ని ప్రధాన పార్టీలు బ్రాహ్మణ, వొక్కళిగ లేదా రెడ్డి అభ్యర్థులనే పోటీ చేయిస్తున్నాయి. తమ తమ కులాల ఓట్లు ఎక్కువగా ఉన్న చోట ఆయా ఓబీసీ కులాలకు చెందిన వారికి టికెట్లు లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment