అసోం చేరిన ఎన్ఐఏ బృదం.. బాధితులకు సీఎం పరామర్శ
కోక్రాఝర్ః అసోంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్నినేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన ( ఎన్ఐఏ) నలుగులరు సభ్యులు గల బృందం పరిశీలించింది. దాడుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని అసోం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ పరామర్శించారు. కోక్రాఝర్ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన దాడిలో 14 మంది పౌరులతో పాటు.. ఓ ఉగ్రవాది మరణించగా అనేకమంది గాయపడ్డారు. ఉగ్రదాడులు జరిగిన సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి శనివారం క్షతగాత్రుల్ని పరామర్శించారు. రాష్ట్రానికీ, దేశానికీ ముప్పును తలపెట్టే ఎవర్నీ ప్రభుత్వం సహించేది లేదని ఆయన టెర్రరిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. దాడులు.. స్వాతంత్రదినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్లు, సూపరింటిండెంట్ల తో సహా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
అసోంలోని రద్దీగా ఉండే కోక్రాఝర్ మార్కెట్ ప్రాంతానికి శుక్రవారం మధ్యాహ్నం కారులో వచ్చిన సాయుధ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిగిన సమయంలో దగ్గరల్లోనే గస్తీ నిర్వహిస్తున్న సైనికులు.. గ్రైనేడ్ల చప్పుడుకు అక్కడకు చేరుకొని ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మరణించగా మిగిలినవారు తప్పించుకున్నారు. మరణించిన మిలిటెంట్ పేరు మోన్ జాయ్ ఇస్లారీగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే దాడి వెనుక బోడో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఎన్ఐఏ బృందం ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలిని పరిశీలించి విచారణ జరుపుతోంది.
రద్దీగా ఉండే బలిజన్ తినియాలీ వీక్లీ మార్కెట్ కు కారు నిండుగా మారణాయుధాలతో వచ్చిన మిలిటెంట్లు.. శుక్రవారం మధ్యాహ్నం ప్రాంతంలో దాడులు జరుపగా 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలారు. దాడుల్లో మరో 20 మందివరకూ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దాడుల వెనుక నేషనల్ డిమొక్రెటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ హస్తం ఉండవచ్చని అసోం డీజీపీ ముఖేష్ సహాయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంనుంచీ ఏకే-56, 47 సిరీస్ రైఫిల్స్ తోపాటు గ్రెనేడ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ యూనిఫాం వంటి దుస్తులు వేసుకున్న ఐదుగురు వ్యక్తులు ముఖం కనిపించకుండా కట్టుకొని వ్యాన్ లో మార్కెట్ ప్రాంతానికి చేరుకొన్నారని, సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు స్థానిక దుకాణం యజమాని, ప్రత్యక్ష సాక్షి, 30 ఏళ్ళ మానిక్ దేబనాథ్ తెలిపారు. మిలిటెంట్లు విసిరిన గ్రెనేడ్ వల్ల ఎనిమిది దుకాణాలకు నిప్పంటుకుందని, దీంతో జనం భయంతో అక్కడినుంచీ తప్పించుకునేందుకు పరుగులు తీశారని మానిక్ తెలిపాడు.