ఎవరినీ వదిలిపెట్టబోం!
గువాహటి: బోడోల్యాండ్‌లోని కోక్రాఝర్‌లో తాజాగా చోటుచేసుకున్న తీవ్రవాద నరమేధం నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సరబానంద్ సోనోవాల్ ఆదివారం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ ఉగ్రవాద ఘటనకు కారణం ఎవరైనా వారిని విడిచిపెట్టబోమని, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ప్రజలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని, ఉగ్రవాద పోకడలపై ఎలాంటి కనికరం చూపకపోవడమే తమ విధానమని సీఎం సోనోవాల్ తెలిపారు.
గత శుక్రవారం జరిగిన కోక్రాఝర్‌లో జరిగిన తీవ్రవాద నరమేధంలో 14మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్-సంగ్‌బిజిత్‌కు చెందిన స్వయంప్రకటిత కమాండర్ మనోజ్ ఇస్లాహారి ఈ తీవ్రవాద దాడికి పాల్పడ్డాడు. సీఎం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని, బోడో తీవ్రవాద చర్యలను ఎంతమాత్రం సహించబోమని అసోం డీజీపీ ముఖేష్ సహాయ్ తెలిపారు.