డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు...
డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు...
Published Sat, Aug 19 2017 9:42 AM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
న్యూఢిల్లీ: దేశం నడిబొడ్డున భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి రాగా, అందుకు కారణమైన ఓ విదేశీయుడు పారిపోతూ ప్రాణాలు కోల్పోయాడు. దక్షిణ ఢిల్లీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఛత్రర్‌పూర్ ఎన్‌క్లేవ్ ఫేజ్-1 లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నైజీరియాకు చెందిన సైప్రియన్ అమ ఒగ్బోన్నయా(40) అనే వ్యక్తి డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీం మెరుపు దాడి నిర్వహించింది. పోలీసులు రావటం గమనించిన అతను పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే వేరే దారి లేకపోవటంతో నాలుగో అంతస్థు కిటికీ నుంచి దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఎయిమ్స్ కు తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. సైప్రియన్ కిటీకిలోంచి దూకిన దృశ్యం సీసీ టీవీ కెమెరాలో నమోదుకాగా, ‘ఓ వ్యక్తి హెల్మెట్ తో నాలుగో అంతస్థు నుంచి దూకాడని, మధ్యలో ఎయిర్ కండినర్ ను ఢీకొట్టడంతో అది ఊడి నేలపై పడి తీవ్రంగా గాయపడ్డాడని’ ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నాడు.
ఆ సమయంలో ఒగ్బోన్నయా వెంట మరో ఇద్దరు మహిళలు ఉన్నారని, అతని వెంటే వాళ్లు కూడా దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఢిల్లీ ప్రత్యేక సెల్ అధికారి ప్రమోద్ కుష్వాహా పేర్కొన్నారు. సుమారు 25 కిలోల కెటామైన్ అనే మాదక ద్రవ్యాన్ని స్వాధీనపరుచుకోగా, అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువ 20 కోట్లు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. డ్రగ్స్ కేసు కింద ఆ ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ప్రమోద్ వెల్లడించారు. ఇంతకు ముందు నగరంలో ఇలాగే ఓ నైజీరియన్ ముఠా డ్రగ్స్ కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు బిల్డింగ్ పై నుంచి పారిపోయింది.
Advertisement