మావోయిస్టులు పేల్చేసిన వాహనం. ఇన్‌సెట్లో మరణించిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు
సాక్షి, కొత్తగూడెం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ దాడికి తెగబడ్డారు. సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా.. సుక్మా జిల్లా కిష్టారం వద్ద మంగళవారం అత్యంత శక్తివంతమైన మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారంతా ఉత్తరప్రదేశ్, బిహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే. కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల 20 మంది మావోయిస్టులు మరణించిన తడపలగుట్టలో ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు.
200 కిలోల పేలుడు పదార్థంతో..
ఇటీవల మావోయిస్టుల విధ్వంస కార్యకలాపాలు పెరగడంతో కిష్టారం క్యాంపునకు అనుబంధంగా కాసారంలో మరో సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పలువురు జవాన్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఈ అనుబంధ క్యాంపునకు బయలుదేరారు. దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు.. మార్గంలో సుమారు 200 కిలోల అత్యాధునిక పేలుడు పదార్థాల (ఐఈడీ)ను అమర్చా రు. సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనాల్లో మొదటి వాహనం అక్కడికి చేరుకోగానే.. మందుపాతరను పేల్చారు. మావోయిస్టులు సాధారణంగా 20 కిలోల వరకు పేలుడు పదార్థాన్ని మందుపాతరల్లో వాడుతారు. అలాంటిది ఏకంగా 200 కిలోల వరకు వాడటంతో... భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి జవాన్ల బుల్లెట్ ప్రూఫ్ వాహనం సుమారు 20 అడుగుల మేర ఎగిరిపడింది. అందులో ఉన్న 11 మంది జవాన్లలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే చనిపోయిన జవాన్లకు సంబంధించిన ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించారని.. వెనుక మరో వాహనంలో వస్తున్న జవాన్లు కాల్పులు జరపడంతో వారు పారిపోయారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో 200 మంది వరకు మావోయిస్టులు పాల్గొని ఉంటారని పేర్కొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌కు తరలించారు. మృతదేహాలు ఘటనా స్థలంలోనే ఉన్నాయని.. బుధవారం మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయనున్నారు. అనంతరం ఏపీ పరిధిలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
అంతా యూపీ, బెంగాల్, బిహార్ వారే
మరణించిన జవాన్లంతా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే. వారిని ఆర్‌కేఎస్.థామస్, అజయ్ కె.ఆర్.యాదవ్, మనోరంజన్, జితేందర్‌సింగ్, శోభిత్ కె.ఆర్.శర్మ, లక్ష్మణ్, మనోజ్ సింగ్, ధర్మేంద్ర సింగ్, చంద్ర హెచ్.ఎస్‌లుగా గుర్తించారు. మాధవ్‌కుమార్, రాజేశ్‌కుమార్‌లు గాయపడ్డారు. ఘటనా స్థలాన్ని ఛత్తీస్‌గఢ్ డీఐజీ డీపీ ఉపాధ్యాయ, సుక్మా ఎస్పీ అభిషేక్ శాండిల్య పరిశీలించారు.
సెలవులు ముగించుకుని రాగానే..
ఆంధ్రప్రదేశ్‌లోని ఎటపాకలో ఉన్న సీఆర్పీఎఫ్ కార్యాలయం ద్వారా సరిహద్దుల్లో బేస్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులు ముగించుకుని వచ్చిన 212 బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఇక్కడ రిపోర్టు చేసి.. తమ బేస్ క్యాంపులకు వెళ్లి విధుల్లో చేరారు. వారిలో కొందరు కిష్టారం సమీపంలోని కాసారం అనుబంధ క్యాంపునకు వెళ్తుండగా మావోయిస్టుల బాంబు దాడి ఘటన జరిగింది. సెలవులు ముగించుకుని విధుల్లో చేరిన కొన్ని గంటల్లోనే జవాన్లు మృత్యువాతపడటంతో విషాదం నెలకొంది.
తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా..!
తెలంగాణలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలనుకున్న మావోయిస్టులకు తడపలగుట్ట ఎన్‌కౌంటర్ రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్న మావోయిస్టులు.. అవకాశం కోసం ఎదురుచూసి, తాజా దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. తడపలగుట్ట ఎన్‌కౌంటర్‌తో ఆగ్రహంగా ఉన్న మావోయిస్టులు.. ఈనెల 5న అర్ధరాత్రి సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధ్వంసం సృష్టించారు. హైదరాబాద్–2 డిపోకు చెందిన రెండు బస్సులు, ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ప్రైవేటు బస్సు, మూడు లారీలు, ఒక ట్రాక్టర్‌ను దహనం చేశారు. మరో ఘటనలో ఓ వ్యక్తిని హతమార్చారు. తాజాగా బాంబు పేలుడుకు పాల్పడ్డారు.
సంతాపం వ్యక్తం చేసిన మోదీ
మావోయిస్టుల మందుపాతర పేలుడులో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మావోయిస్టుల దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు భారతదేశం సెల్యూట్ చేస్తోంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..’’అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. కాగా జవాన్లు మరణించిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment