న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో నిర్భయ దోషులను ఉరితీసేందుకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న వేళ దోషుల్లో ఒకడైన అక్షయ్ ఠాకూర్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఫిబ్రవరి 1న అమలు కానున్న మరణ శిక్షపై స్టే విధించాలంటూ గురువారం పటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అదే విధంగా ఉరిశిక్షను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులోనూ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ఇదే కేసులో మరో దోషి అయిన వినయ్ శర్మ బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ వేసిన విషయం విదితమే. జైళ్లో ఇప్పటికే పలుమార్లు చచ్చిపోయాను కాబట్టి తనను క్షమించాలని.. 2012 ఘటన తన జీవితాన్ని మార్చివేసిందని.. అయితే దీనికి మరణ శిక్ష అమలు చేయాలా వద్దా లేదా అన్న విషయాన్ని మీరే నిర్ణయించాలంటూ రాష్ట్రపతిని అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలు తేదీపై మరోసారి సందేహాలు తలెత్తుతున్నాయి.(నిర్భయ కేసు: మరో అనూహ్య పరిణామం..అసలు ఫిబ్రవరి 1న ఉరితీస్తారా?)
కాగా ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు గత కొన్ని రోజులుగా నిర్భయ దోషులు చట్టంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే. క్యూరేటివ్ పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు, స్టే కోరుతూ నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31) వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. నిజానికి జనవరి 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ... వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సర్వోన్నత న్యాయస్థానంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం.. ముఖేష్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన నేపథ్యంలో.. నిబంధనలను అనుసరించి ఫిబ్రవరి 1న ఉరితీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో... ఏదో విధంగా ఉరిశిక్ష తేదీ మారేలా చేయడం, ఉరిశిక్ష నుంచి తప్పించుకునేలా దోషులు పావులు కదుపుతున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులకు దాదాపు రెండేళ్ల క్రితమే ఉరిశిక్ష విధించినా.. శిక్ష అమలులో జాప్యంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment