న్యూఢిల్లీ: ఉరి అమలుకు ముందు నిర్భయ దోషులు చివరి కోరిక చెప్పలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. వారు రాత్రంతా నిద్ర లేకుండా గడిపారని తెలిపారు. గత రాత్రి భోజనం చేయలేదని, ఉరి తీసే గంట ముందు బ్రేక్ ఫాస్ట్‌కు నిరాకరించారని పేర్కొన్నారు. ఉరి అమలు ముందు రోజు (గురువారం రాత్రి) వారిని విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచామని తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటలకు వారు నిద్ర లేచారని, అప్పటికే సుప్రీం కోర్టు వారి చివరి పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపారు. దోషులను స్నానం చేయాలని కోరగా.. ఎవరూ అంగీకరించలేదని అన్నారు. కాగా, నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31)ను ఈరోజు ఉదయం 5:30 గంటలకు తీహార్ సెంట్రల్ జైలులోని జైలు నెంబర్ 3లో ఉరితీసిన సంగతి తెలిసిందే.
(చదవండి: నిర్భయ కేసు : దేశ చరిత్రలో ఇదే ప్రథమం)
30 నిముషాలపాటు ఉరి..
ఉరికి ముందు దోషులను నిర్భయ కుటుంబ సభ్యులకు చూపించామని జైలు అధికారులు చెప్పారు. ఉరి అమలు నేపథ్యంలో జైలంతా లాక్‌డౌన్‌లో ఉంచామని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇక కారాగార సమయంలో పవన్, వినయ్, ముఖేష్ జైల్లో పనిచేశారని, వారు సంపాదించిన మొత్తం ఆయా కుంటుంబాలకు అందిస్తామని జైలు అధికారులు చెప్పారు. 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీశామని తీహార్ జైలు అధికారి సందీప్ గోయల్ చెప్పారు. నిబంధనల మేరకు తలారి పవన్ జల్లాద్ దోషులను 30 నిముషాలపాటు ఉరికి వేలాడదీశాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇదిలాఉండగా.. ఉరి అమలుకు ముందు వినయ్ కుమార్ ఉరి తీయొద్దని పోలీసులను వేడుకున్నట్టు తెలిసింది. ఉరి భయాల నేపథ్యంలో అతను గత ఫిబ్రవరిలో గోడకు తల బాదుకున్నట్టు సమాచారం.
(చదవండి: నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ)
Comments
Please login to add a commentAdd a comment