న్యూఢిల్లీ: ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ డాక్యుమెంటరీ వివాదంలో అనేక పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినం రోజు ప్రసారం చేయడానికి ఉద్దేశించిన బీబీసీ డాక్యుమెంటరీలో నిర్భయ కేసు దోషి ముఖేష్ సింగ్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ిది ప్రకంపనలకు కారణమైంది. దీనిపై హోంమంత్రి సీరియస్ గానే స్పందించి విచారణకు ఆదేశించారు. ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది.
ఆ డాక్యుమెంటరీ నిషేధాన్ని నిర్భయ తండ్రి తొలుత వ్యతిరేకించారు. మన సమాజ పరిస్థితికి ముఖేష్ మాటలు అద్దం పడతాయన్నారు. ఇది అందరూ చూడాల్సిన వీడియో అని కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ స్పందన చూశారో ఏమో గానీ ఈ డాక్యుమెంటరీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. దోషి ముఖేష్ సింగ్ మాటలను తీవ్రంగా ఖండిస్తూనే.. లెస్లీ ఉద్విన్ తీసిన ఫిలింలో ఎక్కడా తమ పేర్లు వాడొద్దని, గోప్యంగా ఉంచాలని కోరామనీ.. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరించారని, అందుకు వారికి లీగల్ నోటీసులు ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు, ప్రభుత్వం స్పందించిన తీరుపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కొద్ది సేపటిలోనే రెండు విభిన్న వైఖరులు ప్రదర్శించడం పలువురిని విస్మయానికి గురిచేసింది.
ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్ శోభా డే కూడా ఈ డాక్యుమెంటరీ నిషేధాన్ని వ్యతిరేకించారు. మరోవైపు వివాదాస్పదమైన ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీని ప్రసారం చేయొద్దని కేంద్ర హోంమంత్రిత్వశాఖ బీబీసీని కోరింది. కానీ హోంశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఒక వైపు ఇండియాలో దీనిపై వివాదం రగులుతూండగానే ..అనుకున్న దానికంటే ముందుగానే బుధవారం రాత్రి పదిగంటలకు బీబీసీ ఈ డాక్యుమెంటరీ ప్రసారం చేసేసింది. పైగా చాలా బాధ్యతాయుతంగానే తామీ డాక్యుమెంటరీ తీశామని సమర్ధించుకుంది.
మరోవైపు ఈ వివాదాస్పద డాక్యుమెంటరీ దృశ్యాలను డిలిట్ చేయాల్సిందిగా వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ ను కోరినట్టు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన విషయం కనుక సంబంధిత చర్యలు తీసుకోవాల్సిందిగా యూ ట్యూబ్ ను కోరామని కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని యూ ట్యూబ్ ధ్రువీకరించలేదు.