‘రక్షణ’ బాధ్యతలు చేపట్టిన నిర్మల
న్యూఢిల్లీ: మిలిటరీ సన్నద్ధత, రక్షణ రంగంలో ‘మేకిన్ ఇండియా’ అమలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, సైనికుల సంక్షేమాలే తన ప్రాథమ్యాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత తొలి పూర్తిస్థాయి మహిళా రక్షణ మంత్రిగా ఆమె గురువారం బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి ఆర్థిక మంత్రి, మాజీ రక్షణ మంత్రి జైట్లీ, నిర్మల తల్లిదండ్రులు హాజరయ్యారు. అంతకు ముందు ఆమె చాంబర్‌లో పూజలు నిర్వహించారు. సైనిక బలగాల సన్నద్ధతకు అధిక ప్రాధాన్యమిస్తానని నిర్మల చెప్పారు. రక్షణ రంగ శక్తి, సామర్థ్యాల పెంపునకు ‘మేకిన్ ఇండియా’ ప్రధాన పాత్ర పోషించాలని, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి పాటుపడతానని ఆమె అన్నారు.
మాజీ సైనికులకు రూ.13 కోట్లు
బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మలా సీతారామన్ సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ నుంచి రూ.13 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ నిధులను 8685 మంది మాజీ సైనికులు, అమరుల భార్యలు, వారి కుటంబ సభ్యుల సంక్షేమానికి వినియోగిస్తారు. రక్షా మంత్రి ఎక్స్–సర్వీస్‌మెన్ ఫండ్ నుంచి కూడా ఆర్థిక సాయం చేయడానికి మంత్రి అంగీకారం తెలిపారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈమెతో సమావేశమయ్యారు.