నా కారుకే జరిమానా విధించారు : గడ్కరీ | Nitin Gadkari Says Even My Car Was Fined In Mumbai | Sakshi
Sakshi News home page

నా కారుకే జరిమానా విధించారు : గడ్కరీ

Published Mon, Sep 9 2019 3:39 PM | Last Updated on Mon, Sep 9 2019 7:35 PM

Nitin Gadkari Says Even My Car Was Fined In Mumbai - Sakshi

ముంబై : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 పై విస్తృత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు వాహనదారులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అనుసరించి ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించిన పలువురు వాహనదారులకు అధికారులు భారీ జరిమానాలు విధించారు. దీనిపై స్పందించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ .. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ చట్ట ప్రకారం విధించే జరిమానాలను ఆయన సమర్థించారు.

ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలనపై గడ్కరీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోటార్‌ వాహన సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.. అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పారు. తాను ఆ జరిమానాను చెల్లించినట్టు వెల్లడించారు. దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 786 బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నాయని చెప్పారు. అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని తెలిపారు. ట్రాఫిక్‌ అధికారులు ఎవరిపై వివక్ష చూపరని తెలిపిన ఆయన.. నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని అన్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినట్టు గుర్తుచేశారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు ఇతర పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ భారీ జరిమానాల కారణంగా అవినీతి పెరుగుతుందనే ఆరోపణలను గడ్కరీ ఖండించారు. తాము అన్ని చోట్ల కెమెరాలు పెట్టామని.. అలాంటప్పుడు అవినీతికి అస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం కారణంగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లఘించినవారికి విధించే జరిమానాలు గతంతో పోల్చితే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement