
దేశంలో పెట్రోల్, డీజిల్ కార్లను నిషేధించే ఉద్దేశం లేదని కేంద్ర రవాణా శాఖ, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో డీజిల్, పెట్రోల్ కార్లను నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఎగుమతులు, ఉపాధి రంగంలో ఆటోమొబైల్ రంగం పాత్రను ప్రభుత్వం గుర్తెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతుల్లో ఆటోమొబైల్ రంగం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. పెద్దసంఖ్యలో వాహనాలున్న దేశం ముడిచమురు దిగుమతుల విషయంలో సమస్యలు ఎదుర్కొంటోందని, ఇక కాలుష్యం, రహదారుల భద్రతలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో రూ 4.50 లక్షల కోట్ల విలువైన ఆటోమొబైల్ రంగం పరిశుభ్ర ఇంధనం వైపు మళ్లాలని పిలుపుఇచ్చారు. కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం ప్రజల్లో అనారోగ్య సమస్యలను వ్యాప్తి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.