న్యూఢిల్లీ: భద్రతా పరమైన లోపాల కారణంగా 13 లక్షల ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్లను గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) కంపెనీలు వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) గణాంకాల ప్రకారం.. 8,64,557 ద్విచక్ర వాహనాలు, 4,67,311 ప్యాసింజర్ కార్లు వెనక్కి పిలిచిన వాటిల్లో ఉన్నట్టు చెప్పారు.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 1,60,025 ద్విచక్ర వాహనాలు, 25,142 ప్యాసింజర్ కార్లను వెనక్కి తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. తయారీ అనంతరం లోపాలు బయటపడినప్పుడు ఆయా బ్యాచ్‌ల వారీగా మొత్తం వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు వెనక్కి పిలిపించి, అన్నింటినీ సరిచేసిన తర్వాత అప్పగిస్తుంటాయి.
ఇక 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇలా మొత్తం 3.39 లక్షల వాహనాలు, 2019–20లో 2.14 లక్షల వాహనాలను కంపెనీలు వెనక్కి పిలిపించుకున్నాయి. ‘‘ఓ మోటారు వాహనంలో లోపం వల్ల పర్యావరణానికి లేదా నడిపే వారికి లేదా ఆ వాహనంలో ప్రయాణించే వారికి, లేదంటే రహదారులను వినియోగించుకునే ఇతరులకు ప్రమాదం అని భావిస్తే.. వాటిని వెనక్కి తీసుకోవాలని కంపెనీలను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది’’అని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment