
లాలూకు మద్దతు ఆపండి
రాహుల్‌కు స్పష్టం చేసిన
నితీశ్‌కుమార్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్ కుటుంబానికి మద్దతుగా మాట్లాడడం ఆపాలని రాహుల్‌కి బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. మహాకూటమి ప్రభుత్వంలో సంక్షోభం నేపథ్యంలో శనివారం ఆయన రాహుల్‌తో భేటీ అయ్యారు. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై అనర్హత వేటును అడ్డుకునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ చించివేయాలని 2013లో రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని ఈ భేటీలో నితీశ్ గుర్తు చేశారని ఆయన సన్నిహితుడొకరు వెల్లడించారు.
తేజస్వీ రాజీనామా చేయాల్సిందేనని నితీశ్ తన నిర్ణయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. బిహార్ సీఎంపై విమర్శలతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో మరింత గందరగోళం సృష్టించిందని, తేజస్వీ యాదవ్‌పై కాంగ్రెస్ నాయకత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని జేడీయూ వర్గాలు డిమాండ్ చేశాయి. కాగా రాహుల్‌తో నితీశ్ భేటీ మర్యాదపూర్వకమేనని, తేజస్వీ యాదవ్ పై పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పులేదని జేడీయూ ప్రతినిధి అజయ్ అలోక్ చెప్పారు. బిహార్‌లో సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, నితీశ్‌తో భేటీలో ఆ అంశంపై చర్చించారని సీనియర్ కాంగ్రెస్ నేత ప్రేమ్‌చంద్ మిశ్రా పేర్కొన్నారు.
లాలూకు మరో షాక్!
న్యూఢిల్లీ: బిహార్ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవికి కల్పిస్తున్న వీవీఐపీ సౌకర్యాన్ని కేంద్రం రద్దు చేసింది. పట్నా విమానాశ్రయంలో లాలు దంపతుల వాహనం నేరుగా విమానాల వద్దకు వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తూ 2009లో అప్పటి యూపీఏ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పౌర విమానయానశాఖ స్పందిస్తూ వారికి కల్పి స్తున్న సౌకర్యాన్ని రద్దు చేశామని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరి టీకి లేఖ రాసింది.