డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడేనా ?
సామాన్యుడి ఆగ్రహం
సర్వీస్ ఛార్జీల విధింపుపై బ్యాంకులపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. స్వచ్ఛదంగా సోషల్ మీడియా వేదికగా బ్యాంకులపై వ్యక్తమవుతున్న ఆగ్రహానికి అనూహ్య స్పందన వస్తోంది. ఇటీవల పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు బ్యాంకింగ్ సేవలపై విధించిన సర్వీసు ఛార్జీలపై ఖాతాదారులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనలపై సోషల్ మీడియాలో రెండు వాదనలు చక్కర్లు కొడుతున్నాయి
డబ్బులు వేస్తే బాదుడు.. తీస్తే బాదుడు. బ్యాలెన్స్ లేకపోయినా బాదుడే. బ్యాంక్ అంటే చాలు వణికిపోయే రోజులు వచ్చాయని నెటిజన్లు మండిపడుతున్నారు. అత్యవసరం సమయాల్లో కూడా తమ డబ్బులు తాము తీసుకున్నా సరే తప్పని ఛార్జీల బాదుడుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే నినాదం అందుకున్నారు. ఏప్రిల్ 6న దేశంలో ఎవరూ బ్యాంకులకు వెళ్లొద్దు. లావాదేవీలు జరపొద్దు అని పిలుపునిస్తున్నారు. ఆన్ లైన్, మొబైల్, పేటీఎం ఇలా అన్ని లావాదేవీలు జరపొద్దని కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆర్బీఐ కొత్త రూల్స్, బ్యాంకుల బాదుడుపై ఖాతాదారులు దండయాత్రకు రెడీ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి.. కొన్ని జాతీయ ఇంగ్లీష్ పత్రికలు కూడా ప్రముఖంగా చోటివ్వటం విశేషం.
అలాగే ఏప్రిల్ 6వ తేదీ నో ట్రాన్సాక్షన్ డేకు ఆర్బీఐ, బ్యాంకులు దిగిరాకపోతే.. మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 24, 25, 26 మూడు తేదీలను నో ట్రాన్సాక్షన్ డేలుగా జరపాలని పిలుపునిస్తున్నారు.
ఇదిలావుంటే దీనికి సంబంధించి మరో వాదన కూడాతెరపైకి వచ్చింది. ఈ నెలాఖరున అంటే 31 తేదీల్లో అణా పైసలుతో సహా అకౌంట్లలోని నగదును విత్ డ్రా చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. తద్వారా ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ బ్యాలెన్సులు ఒక్కసారిగా డౌన్ అయి బ్యాంకులు ఇబ్బందులు తప్పవని వాదిస్తున్నారు. కస్టమర్ల చేతిలో పదునైన ఆయుధం ఇదే అని చెబుతున్నారు. అందరితో జీరో బాలన్స్ తో అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ల ఇష్టమైనట్లు రూల్స్ పెడితే మనం చూస్తూ ఊరుకోవద్దు. వెంటనే మీ అకౌంటులో ఉన్న మొత్తం బ్యాలెన్స్ అంతా మార్చ్ 31న విత్‌డ్రా చెయ్యండంటున్నారు.
ఈ సమాచారాన్ని ప్రతి ఒక్క పౌరుడికి, బ్యాంక్ ఖాతాదారుడికి చేరేలా వెళ్లాలన్న రిక్వెస్ట్లు కూడా సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్నాయి. ఈ ఉద్యమానికి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది.. బ్యాంకులు ఎలా స్పందిస్తాయో అనేది వేచిచూడాల్సిందే.