సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అన్నారు. గడిచిన ఏడు రోజుల్లో దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే 47 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులు వెలుగుచూడలేదని, గత 21 రోజుల్లోనూ 39 జిల్లాలో కరోనా కేసులు నమోదుకాలేదని వెల్లడించారు. ఇక గడిచిన 28 రోజుల్లో దేశ వ్యాప్తంగా 17 జిల్లాల్లో కేసులేమీ వెల్లడికాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో హర్షవర్థన్ వివరాలను వెల్లడించారు. వైరస్ కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్‌డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. (కరోనా.. 24 గంటల్లో 62 మంది మృతి)
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరంగా ఉందని, దీనిపై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. కాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1543 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 29435కి చేరిందన్నారు. ఇప్పటివరకు 6,869 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 934 మంది మృతిచెందారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 21,632 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. (ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment