మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా.. | No Girl Born In 132 Villages In Uttarkashi In 3 Months: Report | Sakshi
Sakshi News home page

ఉత్తర కాశీలో విడ్డూరం!

Published Mon, Jul 22 2019 11:45 AM | Last Updated on Mon, Jul 22 2019 3:59 PM

No Girl Born In 132 Villages In Uttarkashi In 3 Months: Report - Sakshi

ఉత్తరకాశీ: గత మూడు నెలల కాలంలో ఆ 132 గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదట. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. ఒక పక్క ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారిక గణంకాల ప్రకారం.. ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో గత మూడు నెలల్లో 216 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఒక్క ఆడ శిశువు కూడా లేదని ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి. దీని వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఆశిష్‌ చౌహాన్‌ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చూసేందుకు నిఘా పెంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.

కాకతాళీయం కాదు, కుట్ర
మూడు నెలల కాలంలో వందకు పైగా గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించకపోవడం కాకతాళీయంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్‌ ఆరోపించారు. ఉత్తర కాశీలో ఆడపిల్లలు పుట్టకుండా చేసేందుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నాయని మండిపడ్డారు.

గట్టి చర్యలు తీసుకోండి
భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీనియర్‌  జర్నలిస్ట్‌ శివసింగ్‌ థన్‌వాల్‌ డిమాండ్‌ చేశారు. ‘లింగ నిష్పత్తిపై ప్రభుత్వ గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉత్తరకాశీలో పరిస్థితి ఉంది. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని అధికారిక లెక్కలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి అనాగరిక చర్యలకు అడ్డుకట్టవేయాల’ని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement