Female Foeticide
-
మూడు నెలల్లో ఒక్క ఆడ శిశువు కూడా..
ఉత్తరకాశీ: గత మూడు నెలల కాలంలో ఆ 132 గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించలేదట. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఈ వింత చోటుచేసుకుంది. ఒక పక్క ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నా వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అధికారిక గణంకాల ప్రకారం.. ఉత్తరకాశీ జిల్లాలోని 132 గ్రామాల్లో గత మూడు నెలల్లో 216 మంది శిశువులు జన్మించారు. వీరిలో ఒక్క ఆడ శిశువు కూడా లేదని ప్రభుత్వ లెక్కలు వెల్లడించాయి. దీని వెనుకున్న కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర సర్వే, అధ్యయనం చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆశిష్ చౌహాన్ తెలిపారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆశా వర్కర్లతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చూసేందుకు నిఘా పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. కాకతాళీయం కాదు, కుట్ర మూడు నెలల కాలంలో వందకు పైగా గ్రామాల్లో ఒక్క ఆడ శిశువు కూడా జన్మించకపోవడం కాకతాళీయంగా జరిగింది కాదని, దీని వెనుక కుట్ర ఉందని సామాజిక కార్యకర్త కల్పనా థాకూర్ ఆరోపించారు. ఉత్తర కాశీలో ఆడపిల్లలు పుట్టకుండా చేసేందుకు భ్రూణహత్యలు జరుగుతున్నాయన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నాయని మండిపడ్డారు. గట్టి చర్యలు తీసుకోండి భ్రూణహత్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని సీనియర్ జర్నలిస్ట్ శివసింగ్ థన్‌వాల్ డిమాండ్ చేశారు. ‘లింగ నిష్పత్తిపై ప్రభుత్వ గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ప్రశ్నలు రేకెత్తించేలా ఉత్తరకాశీలో పరిస్థితి ఉంది. ఆడ శిశువులను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని అధికారిక లెక్కలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి అనాగరిక చర్యలకు అడ్డుకట్టవేయాల’ని అన్నారు. -
ఈ అమ్మాయి మాటలకు.. సీఎం కంటతడి
అహ్మదాబాద్: ఆడశిశువుల భ్రూణహత్యలపై తొమ్మిదో తరగతి విద్యార్థిని అంబికా గోహెల్ చేసిన భావోద్వేగ ప్రసంగం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ సహా సభికులందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఖేడా జిల్లా మహుదా తాలూకాలోని హెరంజీ గ్రామానికి చెందిన అంబిక ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది. భ్రూణహత్యకు గురైన ఓ ఆడశిశువు తన తల్లిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా ఊహాజనిత కల్పిత లేఖను అంబిక చదవి వినిపించింది. తల్లిగర్భంలో మరణించిన ఆడశిశువుకు కూడా ప్రపంచాన్ని చూడాలని ఉంటుందని, గాలిని పీల్చాలని ఉంటుందని, అయితే ఈ అవకాశాన్ని ఇవ్వడం లేదంటూ మృత శిశువు ఆవేదన చెందుతున్నట్టుగా అంబిక ప్రసంగించింది. 'నేను ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే నన్ను చంపేశారు. అమ్మా ఓ విషయం గుర్తించుకో. కూతురు లేకుంటే ఇల్లు ఇల్లే కాదు' అని మృతశిశువు బాధను అంబిక తన మాటల్లో చెప్పింది. అంబిక మాట్లాడుతుండగా.. భావోద్వేగానికి గురైన అమ్మాయిలు సభలో ఏడ్చేశారు. అంబిక ప్రసంగం పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్.. ఆ అమ్మాయిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. తనకు డాక్టర్ కావాలని ఉందని అంబిక సీఎంతో చెప్పారు. -
లింగ నిర్ధారణలు అవసరం: మేనకా గాంధీ
న్యూఢిల్లీ: లింగ నిర్ధారణపై ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు చేయలేదని కానీ ఆ విషయం మాత్రం చర్చల దశలో ఉందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలిపారు. భ్రూణ హత్యలను నివారించాలంటే మాత్రం లింగ నిర్ధారణ పరీక్షలు తప్పక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. సోమవారం జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ప్రతీ గర్భిణి తనకు పుట్టబోయే శిశువు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు, పలు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో లింగ నిర్ధారణపై కేబినేట్ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్వీటర్ లో సమాధానమిచ్చింది. ఈ విషయంలో ప్రతి గర్భాన్ని రిజిస్టర్ చేసుకుని తల్లిదండ్రులకు లింగ నిర్ధారణను తెలియపరిస్తే ఎలాంటి భ్రూణ హత్యలకు తావుండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పద్ధతి గురించి ఆలోచిస్తున్నామని ఈ విషయంపై మీడియా ప్రతినిధులు, మేధావుల సలహాలు అందజేయాలని కోరింది. -
'లింగ నిర్ధారణ'పై సంచలన నిర్ణయం దిశగా కేంద్రం!?
- లింగ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేస్తే భ్రూణహత్యలు తగ్గుతాయన్న మేనకా గాంధీ - కేంద్ర క్యాబినెట్ కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి జైపూర్: 'ముళ్లపొదల్లో ఆడ శిశువు', 'అప్పుడే పుట్టిన పాపను చంపిన తండ్రి' తరహా వార్తలు నాగరిక సమాజంలో ఇకపై వినిపించవని ఆశించవచ్చేమో! కఠిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ భ్రూణహత్యలు విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణపై రెండు దశాబ్ధాలుగా అమలవుతోన్న నిషేధాన్ని ఎత్తివేసి, ఆ పరీక్షలను తప్పనిసరి చేయాలని, తద్వారా భ్రూణహత్యలకు పాల్పడేవారిని సులువుగా గుర్తించవచ్చని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను క్యాబినెట్ ముందర ఉంచామని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. జైపూర్ లో జరగుతున్న కేంద్ర మంత్రల ప్రత్యేక సమావేశానికి హాజరైన ఆమె సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 'గర్భస్త శిశువులకు లింగ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. 20 ఏళ్లుగా స్కానింగ్ పరీక్షలపై కొనసాగుతోన్న నిషేధాన్ని ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని ద్వారా భ్రూణహత్యలకు పాల్పడుతున్నవారిని సులువుగా కనిపెట్టే వీలుంటుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లోగల అంగన్ వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణుల పేర్ల నమోదుచేసుకుని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. నమోదయిన గర్భిణులందరికీ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు జారీచేస్తాం. ఒకవేళ వారు అబార్షన్ చేయించుకోదల్చుకుంటే అందుకుగల సహేతుకకారణాలను వివరించాలి. అడ్డగోలుగా భ్రూణహత్యలకు పాల్పడ్డవాని ఉపేక్షించం' అని మేనకా గాంధీ చెప్పారు.