'లింగ నిర్ధారణ'పై సంచలన నిర్ణయం దిశగా కేంద్రం!?
- లింగ నిర్ధారణ పరీక్షలను తప్పనిసరి చేస్తే భ్రూణహత్యలు తగ్గుతాయన్న మేనకా గాంధీ
- కేంద్ర క్యాబినెట్ కు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
జైపూర్: 'ముళ్లపొదల్లో ఆడ శిశువు', 'అప్పుడే పుట్టిన పాపను చంపిన తండ్రి' తరహా వార్తలు నాగరిక సమాజంలో ఇకపై వినిపించవని ఆశించవచ్చేమో! కఠిన చట్టాలు ఎన్నో ఉన్నప్పటికీ భ్రూణహత్యలు విచ్చలవిడిగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణపై రెండు దశాబ్ధాలుగా అమలవుతోన్న నిషేధాన్ని ఎత్తివేసి, ఆ పరీక్షలను తప్పనిసరి చేయాలని, తద్వారా భ్రూణహత్యలకు పాల్పడేవారిని సులువుగా గుర్తించవచ్చని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను క్యాబినెట్ ముందర ఉంచామని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. జైపూర్ లో జరగుతున్న కేంద్ర మంత్రల ప్రత్యేక సమావేశానికి హాజరైన ఆమె సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
'గర్భస్త శిశువులకు లింగ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. 20 ఏళ్లుగా స్కానింగ్ పరీక్షలపై కొనసాగుతోన్న నిషేధాన్ని ఎత్తేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీని ద్వారా భ్రూణహత్యలకు పాల్పడుతున్నవారిని సులువుగా కనిపెట్టే వీలుంటుంది. ఇప్పటికే దేశంలోని అన్ని ప్రాంతాల్లోగల అంగన్ వాడీ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణుల పేర్ల నమోదుచేసుకుని, వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. నమోదయిన గర్భిణులందరికీ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లు జారీచేస్తాం. ఒకవేళ వారు అబార్షన్ చేయించుకోదల్చుకుంటే అందుకుగల సహేతుకకారణాలను వివరించాలి. అడ్డగోలుగా భ్రూణహత్యలకు పాల్పడ్డవాని ఉపేక్షించం' అని మేనకా గాంధీ చెప్పారు.