
లింగ నిర్ధారణలు అవసరం: మేనకా గాంధీ
న్యూఢిల్లీ: లింగ నిర్ధారణపై ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు చేయలేదని కానీ ఆ విషయం మాత్రం చర్చల దశలో ఉందని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మంగళవారం జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో తెలిపారు. భ్రూణ హత్యలను నివారించాలంటే మాత్రం లింగ నిర్ధారణ పరీక్షలు తప్పక అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
సోమవారం జైపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ప్రతీ గర్భిణి తనకు పుట్టబోయే శిశువు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు, పలు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.
దీంతో లింగ నిర్ధారణపై కేబినేట్ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ట్వీటర్ లో సమాధానమిచ్చింది. ఈ విషయంలో ప్రతి గర్భాన్ని రిజిస్టర్ చేసుకుని తల్లిదండ్రులకు లింగ నిర్ధారణను తెలియపరిస్తే ఎలాంటి భ్రూణ హత్యలకు తావుండదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పద్ధతి గురించి ఆలోచిస్తున్నామని ఈ విషయంపై మీడియా ప్రతినిధులు, మేధావుల సలహాలు అందజేయాలని కోరింది.