న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కాలంలో ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల ఎటువంటి దుష్పరిణామాలకు గురికాకుండా రైతాంగాన్ని కాపాడగలిగామని నీతిఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ అన్నారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగంలో మూడుశాతం అభివృద్ధిని సాధించగలిగామని ఆయన వెల్లడించారు. ఈ లాక్‌డౌన్ కాలంలో రైతుల మార్కెట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా మార్కెట్లు సజావుగా సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతుల వ్యవసాయపనులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదనీ, కేంద్ర మార్గదర్శకాలను పాటించిన రాష్ట్రాల్లో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. ఉత్తర భారతంలో మరోవారంలో రబీ సీజన్‌లో ప్రధాన పంట అయిన గోధుమ దిగుబడి చేతికి వస్తుందనీ, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ప్రభుత్వం చేపట్టినట్టు ఆయన తెలిపారు. భారత దేశంలోని రేషన్ కార్డుకలిగిన 80 కోట్లమంది పేద ప్రజలు ప్రతినెలా ఐదుకేజీల గోధుమ లేదా బియ్యం, ఒక కేజీ పప్పులు 3 నెలల పాటు పొందుతారని ఆయన అన్నారు. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలున్న 20.4 కోట్ల మహిళలకు నెలకు రూ.500 చొప్పున మూడు నెలల్లో రూ. 1,500 జమవుతాయని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment