జయ మృతిపై సీఎం పళని కామెంట్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి స్పందించారు. చెన్నైలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత మృతి విషయంలో ఎలాంటి వివాదాలు, రహస్యాలు లేవని.. కొంతమంది వ్యక్తులు ఈ విషయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయ కన్నుమూసిన విషయం విదితమే. కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఐదు రోజుల్లోగా పరిహారం అందిస్తామని పళనిస్వామి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎంగా తన బలపరీక్ష సమయంలో అంతా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని, చట్ట ప్రకారమే సభ సజావుగా సాగిందని పళనిస్వామి చెప్పారు. శశికళకు జైలుశిక్ష ఖరారు కాగానే ఆమె విధేయుడు పళనిస్వామిని అన్నాడీఎంకే పక్షనేతగా ఎన్నుకోవడం అనంతరం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పళని సహా మంత్రివర్గంతో ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. సభలో విశ్వాసపరీక్షలోనూ పళనిస్వామి 122 ఓట్లతో నెగ్గారు. ఆయనకు వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటేశారు.
అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం మద్ధతుదారులతో పాటు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె.స్టాలిన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్ష అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఇదివరకే గవర్నర్ విద్యాసాగర్ రావును వేర్వేరుగా కలసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో సహా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మరోవైపు పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపైనే డీఎంకే, అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.