నిల్చోవాల్సిన అవసరం లేదు | 'No Need To Stand At Cinema To Prove Patriotism': Supreme Court On Anthem | Sakshi
Sakshi News home page

నిల్చోవాల్సిన అవసరం లేదు

Published Tue, Oct 24 2017 1:46 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

'No Need To Stand At Cinema To Prove Patriotism': Supreme Court On Anthem - Sakshi

న్యూఢిల్లీ: సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరంది. సినిమా వేయడానికి ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.

సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని  కోర్టు స్పష్టం చేసింది. జాతీయగీతాన్ని అవమానపరిచేలా ఉన్నాయంటూ ప్రేక్షకులు థియేటర్లకు టీ–షర్టులు, నిక్కర్లు వేసుకురాకుండా రానున్న రోజుల్లో ప్రభుత్వం నిషేధాజ్ఞలు తీసుకొచ్చినా రావొచ్చని జస్టిస్‌ మిశ్రా వ్యంగ్యంగా అన్నారు. కేరళకు చెందిన కొడుంగళ్లూరు ఫిల్మ్‌ సొసైటీ వేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

థియేటర్లలో సినిమాకు ముందు జాతీయగీతం తప్పనిసరిగా వేయాలనీ, ప్రేక్షకులు కచ్చితంగా లేచి నిలబడాలని గతేడాది నవంబరు 30న జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనమే తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించలేమనీ, అది తల్లిదండ్రులు, గురువులు చేయాల్సిన పని అని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ వాదిస్తూ భారత్‌ ఎంతో వైవిధ్యం కలగలసిన దేశమనీ, ప్రజల్లో ఐక్యత తెచ్చేందుకు జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికే ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం జనవరి 9కి వాయిదా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement