
‘మోడీ నిఘా’పై దర్యాప్తు వద్దు!
* సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుజరాత్ మహిళ
* స్నూప్‌గేట్ వివాదంలో కొత్త మలుపు
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ఓ మహిళపై నిఘా ఉంచి నట్లు చెబుతున్న ‘స్నూప్‌గేట్’ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ నిఘా వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు దర్యాప్తును నిలిపివేసేలా ఆదేశించాలంటూ స్నూప్‌గేట్ వివాదంలో కేంద్ర బిందువైన మహిళ తన తండ్రితో కలిసి మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్లు స్నూప్‌గేట్ అంశంపై దర్యాప్తులో ముందుకు పోకుండా నిరోధించాలంటూ ఆమె తండ్రితో కలిసి సంయుక్త పిటిషన్ దాఖలు చేశారు.
బాధితులు ఫిర్యాదు చేయకుండానే ఇతర కారణాల వల్ల కొందరు వారి హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ నిఘా వ్యవహారంపై సంబంధిత పక్షాల వాదనలు వినకుండానే ప్రస్తుతం దర్యాప్తును నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తులు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సదరు మహిళ పేరును వెల్లడించరాదని మీడియాకు సూచించింది.
* కోర్టుకు పిటిషన్‌దారుల విజ్ఞప్తి ఇదీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లను నియమించడం అన్యాయం. ఇది మా ప్రాథమిక హక్కులైన వ్యక్తిగత గోప్యత, హుందాగా జీవించే హక్కులను ఉల్లంఘించడమే.
* ఈ నిఘా వివాదం వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించండి.
* నా ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు గుజరాత్ సర్కారు తీసుకున్న చర్యలపై నేను సంతృప్తి చెందాను.
* ఆ అంశంపై నేను ఫిర్యాదు చేయకుండానే నన్ను, నా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు దుష్ర్పచారం సాగిస్తున్నారు.
* నిర్ధారించుకోకుండా, అనధికారిక అంశాలతో వెబ్ పోర్టళ్లు కథనాలు వెలువరించడంపై సీబీఐ దర్యాప్తు జరిపించండి.
* నేను గుజరాత్, జాతీయ మహిళా కమిషన్లను సంప్రదించినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు కమిషన్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రతీకారం అనే భావన కలిగించరాదనే: కాంగ్రెస్
స్నూప్‌గేట్ వ్యవహారంపై దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరు ప్రకటించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవడంపై కాంగ్రెస్ మంగళవారం స్పందించింది. రాజకీయ ప్రతీకారం కోసమే ఇలాంటి చర్యలు తీసుకున్నారన్న భావన కలిగించరాదనే మిత్రపక్షాల సలహాల ప్రకారం వెనక్కి తగ్గినట్లు మంగళవారం ఏఐసీసీ సమావేశం సందర్భంగా ఆ పార్టీ నేత, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. మహిళపై మోడీ నిఘా వివాదంపై కేంద్రం నియమించిన దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరును ప్రకటించాలని భావించిన కేంద్రం.. మిత్రపక్షాల అభ్యంతరంతో దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే.