
న్యూఢిల్లీ: ఇకపై మాజీ ప్రధానమంత్రుల కుటుంబ సభ్యులకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) కమెండోల భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్పీజీ చట్టానికి ఈ మేరకు చేసిన సవరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించినట్టుగా ప్రభుత్వ అధికారులు శుక్రవారం వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె సంతానం రాహుల్, ప్రియాంకలకు మూడు దశాబ్దాల తర్వాత ఎస్పీజీ భద్రత తొలగించిన కొద్ది రోజులకే మాజీ ప్రధానుల కుటుంబాలకూ దీనిని వర్తింపజేయనున్నారు.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు సవరణ బ్లిలును వచ్చే వారం లోక్‌సభలో ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోకసభలో చెప్పారు. ఎస్పీజీ చట్టం ప్రకారం కమెండోల రక్షణ ప్రధానమంత్రి, ఆయన కుటుంబసభ్యులకు ఉంటుంది. ఇక మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు పదవీ కాలం ముగిసిన ఏడాది వరకు రక్షణ కల్పిస్తారు. ఆ తర్వాత మాజీ ప్రధానులకు వారికున్న ముప్పు ఆధారంగా పరిస్థితుల్ని సమీక్షించి ఎస్పీజీ భద్రత కొనసాగిస్తారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించిన సవరణ బిల్లు ప్రకారం మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను ఇకపై కల్పించరు.
Comments
Please login to add a commentAdd a comment