
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని లవ్ జిహాద్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అమ్మాయి తాను చేసుకున్న వ్యక్తి సరైనవాడా కాదా అని కోర్టులు చెప్పలేవని స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరి ఇష్టాఇష్టాలపై ఆధారపడి జరుగుతుందని, తాము ఇష్టపడే వివాహం చేసుకున్న తర్వాత అది సరైన నిర్ణయమా కాదా అని కోర్టు ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించింది. తమ కూతురు చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని, ఆమెను మోసగించి ముస్లిం వ్యక్తి వివాహం చేసుకున్నాడని అమ్మాయి తండ్రి తరుపు న్యాయవాది కోర్టుకు వినిపించారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం 'ఆమె ఇష్టపూర్తిగా చేసుకున్న వివాహంపై మేం ఎలాంటి వ్యాఖ్య చేయలేము. అది సరైన నిర్ణయమా కాదా అని మేం నిర్ణయించలేం. కేవలం మీరు చెబుతున్న ఆరోపణల ద్వారా ఆమె చేసుకున్న వ్యక్తి సరైన వాడు కాదని అనలేము. పెళ్లి చేసుకున్న అమ్మాయిని పిలిచి అడిగినప్పుడు తాను ఇష్ట పూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఆమె చెబుతున్న మాటలు నిజమైనవా కాదా అని మనం ఎలా చెప్పగలం. అలాగని ఆమె నిర్ణయాన్ని కూడా తప్పుబట్టడం కోర్టుకు సాధ్యం కాదు' అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment