
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ను ప్రవేశపెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి చర్యలు అవినీతి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని పేర్కొంది. నోటా విధానం ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితమని, నైష్పత్తిక ప్రాతిపదికన నిర్వహించే పరోక్ష ఎన్నికలకు అనుమతించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ‘ఓటింగ్ ప్రక్రియలో నోటా వాడకాన్ని విశ్లేషించినట్లయితే..గోప్యతకు తావులేని రాజ్యసభ ఎన్నికల్లో ఆ విధానం చెడు ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి ఒకటే ఓటు కలిగి ఉన్నా, అది చాలా విలువైనది. ఓటు విలువను నిర్ధారించేందుకు ప్రత్యేక ఫార్ములా ఉంది. ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ, ఒక నియోజక వర్గానికి కాదు. నోటాను అనుమతిస్తే ఫిరాయింపులు మరింత పెరుగుతాయి. పరోక్ష ఎన్నికల్లో దాన్ని అమలుచేస్తే ప్రజాస్వామ్య పవిత్రత దెబ్బతినడమే కాకుండా, అవినీతి, ఫిరాయింపు భూతాలు పురివిప్పుతాయి’అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment