
‘నోట్ల రద్దు’ ప్రభుత్వ సలహానే!
• నకిలీ నోట్లు, నల్లధనం అంతానికి
• నోట్లరద్దు అవసరమన్న ప్రభుత్వం
• పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ వివరణ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయంపై నెలకొన్న అనుమానాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరదించింది. పెద్ద నోట్ల చలామణిని నిలిపేయాలన్న సలహాను కేంద్ర ప్రభుత్వమే తమకు ఇచ్చిందని స్పష్టం చేసింది. నకిలీ నోట్లు, నల్లధనం, ఉగ్రవాదానికి ఆర్థిక సాయం.. దేశాభివృద్ధికి అడ్డుగా మారిన ఈ మూడింటిని అంతమొందించేందుకు నోట్ల రద్దు ఆవశ్యకమని ప్రభుత్వం పేర్కొందని ఆర్బీఐ వెల్లడించింది. నవంబర్ 7న ప్రభుత్వం తమకిచ్చిన ఆ సలహా మేరకు.. ఆ మర్నాడు రూ. 500, రూ. 1000 నోట్ల రద్దును తాము ప్రభుత్వానికి సిఫారసు చేశామని తెలిపింది. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీకి ఈ మేరకు ఆర్బీఐ 7 పేజీల నివేదికను అందజేసింది. ‘రూ. 500, రూ. వెయ్యి నోట్ల రద్దుపై నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం మాకు సలహా ఇచ్చింది.
ఆ తర్వాతి రోజున ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సమావేశమై పెద్ద నోట్ల రద్దును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశా’ అని కాంగ్రెస్ నేత ఎం.వీరప్ప మెయిలీ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ కమిటీకి ఆర్‌బీఐ తెలిపింది. నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం రిజర్వ్‌బ్యాంకు అభిప్రాయం కోరిందని, నకిలీ నోట్లు, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, నల్లధనానికి చెక్ పెట్టేందుకు రూ. 500, రూ. వెయ్యినోట్ల చెల్లుబాటును రద్దు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తమకు సూచించిందని పేర్కొంది. ప్రభుత్వ సూచనపై సుదీర్ఘ చర్చల అనంతరం పెద్ద నోట్ల చెల్లుబాటు రద్దయ్యేలా వాటిని వెనక్కి తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి సమాధానం పంపినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ సిఫార్సు అందిన కొద్ది గంటల్లోపే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయాలంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ సిఫార్సుల మేరకే నోట్ల రద్దుపై కేంద్రం చర్యలు తీసుకున్నట్లు కేబినెట్‌లోని పలువురు మంత్రులు భావించడం గమనార్హం.
కొత్త కరెన్సీపై చాన్నాళ్లుగా కసరత్తు
‘నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు మెరుగైన భద్రతా ప్రమాణాలతో కొత్త కరెన్సీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. అదే సమయంలో ప్రభుత్వం నల్లధనం, ఉగ్రవాదంపై పోరులో చర్యలు చేపట్టిందని’ కమిటీకి పంపిన నివేదికలో వెల్లడించింది. భారీగా పెద్ద నోట్ల లభ్యతతో నల్లధనం కూడబెట్టడం సులభంగా మారిందని, ఉగ్రవాదులకు సాయం చేసేందుకు పెద్ద నోట్ల రూపంలో నకిలీ కరెన్సీ వాడుతున్నట్లు నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల నివేదికలు స్పష్టం చేశాయని చెప్పింది. పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టడం ద్వారా నల్లధనం, నకిలీ నోట్ల చలామణీ, ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం అడ్డుకునేందుకు అరుదైన అవకాశం దొరికిందని, ఆ అదృష్టం కేంద్రానికి, తమకు దక్కిందంటూ ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది.
రూ. 5 వేలు, రూ. 10 వేలు నోట్లు సిఫార్సు చేసిన ఆర్‌బీఐ
రూ. 5 వేలు, రూ 10 వేల నోట్లను ప్రవేశపెట్టాల్సిన అవసరముందంటూ అక్టోబర్ 7, 2014న కేంద్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ సూచించిందని, ద్రవ్యోల్బణం నేపథ్యంలో, చెల్లింపుల్ని సులభతరం చేసేందుకు, సమర్ధంగా కరెన్సీ సరఫరా నిర్వహణ కోసం అప్పట్లో ఆ సూచనలు చేసినట్లు తెలిపింది. ‘అయితే ప్రభుత్వం మాత్రం మే 18, 2016న రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది. మే 27, 2016న కొత్త నమూనా, సైజు, రంగు, థీమ్‌తో కొత్త సీరిస్ కరెన్సీ విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేశాం. కొత్త కరెన్సీ సీరిస్‌లో రూ. 2 వేల నోటు కూడా ఉంది’ అని వెల్లడించింది.
జూన్ 7, 2016న కొత్త సీరిస్ కరెన్సీ విడుదలకు ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిందని, జూన్ 2016లో ముద్రణ ప్రారంభించాలంటూ కరెన్సీ ప్రెస్సులకు సూచించామంది. నోట్ల రద్దుపై ఆర్‌బీఐ మొదటి నుంచి గట్టి నిర్ణయం తీసుకోనప్పటికీ... కొత్త సీరిస్ నోట్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు మాత్రం కొనసాగించిందని, అది తప్పనిసరి పక్రియని నోట్‌లో వెల్లడించింది. కొత్త నోట్ల ముద్రణ తగిన స్థాయికి చేరుకున్నాక... నోట్ల రద్దు నిర్ణయం చేయవచ్చంటూ ప్రభుత్వానికి చెప్పామంటూ మెయిలీ కమిటీకి తెలిపింది.