ఇక రైళ్లలోనూ హైదరాబాదీ బిర్యానీ
న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్‌లో ప్రకటించినట్లుగా ముందుగానే వండి తినేందుకు సిద్ధంగా ఉండే ఆహారాన్ని రైళ్లలో సరఫరా చేసేందుకు ఐటీసీ, ఎంటీఆర్, హల్దీరామ్ వంటి అగ్రశ్రేణి క్యాటరింగ్ సంస్థలను రంగంలోకి దించినట్లు రైల్వే అధికారి ఒకరు వివరించారు. చికెన్ చెట్టినాడ్, హైదరాబాదీ బిర్యానీ, సాంబార్ అన్నం, రాజ్మా చావల్ తదితర వంటకాలను రాజధాని, దురంతో, శతాబ్ది సహా ఆరు రైళ్లలో వారంపాటు ప్రయోగాత్మకంగా అందిస్తామన్నారు.
ప్యాకింగ్ చేసి ఉండే ఈ వంటకాలను వడ్డించేందుకు ముందుగా మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేస్తే సరిపోతుందన్నారు. ఈ విధానంపై ప్రయాణికుల నుంచీ వచ్చే స్పందననుబట్టి ఇతర రైళ్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.