
ఎట్టకేలకు వాడు దొరికాడు..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ క్రైస్తవ సన్యాసిని సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. స్థానిక సెల్దా రైల్వే స్టేషన్లో దిగుతుండగా నజ్రూల్ అకా నాజూ (28)ను బుధవారం సాయంత్రం సీఐడి అరెస్టు చేసింది. అతడు నగరానికి వస్తున్నాడనే పక్కా సమాచారంతో మాటు వేశామని సీఐడి అధికారి చిత్తరంజన్ నాగ్ తెలిపారు. నిందితుడు ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సరిహద్దులో దాక్కున్నట్టుగా తమ విచారణలో తెలిపాడన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అతడిని రాణాఘాట్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.
కాగా కోల్కతాలో 72 సంవత్సరాల నన్పై జరిగిన సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. నదియా జిల్లాలోని ఓ కాన్వెంట్ స్కూల్లోకి చొరబడ్డ దొంగలు నన్పై అత్యాచారానికి తెగబడి, లాకర్ లోని 12 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సీఐడి దర్యాప్తుకు ఆదేశించారు. విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు. ఇపుడు ప్రధాన నిందితుడి అరెస్టుతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు దొరికినట్టయింది.