అమెరికా అధ్యక్షుడితో సోనియా, మన్మోహన్ భేటీ
న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పౌర అణు ఒప్పందం అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ సోమవారం చర్చించారు. దీంతోపాటు అమెరికా-భారత్ మధ్య పలు కీలక రంగాల్లో సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఒబామా భారత పర్యటనలో స్పష్టత వచ్చిన పౌర అణు ఒప్పందాన్ని గతంలో మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
ఈ ఒప్పందం అమల్లో ఇంతకాలం అడ్డంకిగా ఉన్న ‘నష్టపరిహారం’ అంశానికి భారత న్యాయ చట్రం పరిధిలో పరిష్కారం చూపుతామని అమెరికాకు ప్రధాని మోదీ హామీ ఇవ్వడంపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు ఉన్న ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని.. దీనిపై ఒప్పందం పూర్తి ప్రతిని తాము చూడాలని పేర్కొంది.
ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, మన్మోహన్‌తో పాటు రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో ఒబామాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో అణు ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సోనియా, మన్మోహన్‌లు ఒబామాతో చర్చించినట్లు సమాచారం. ఇరాక్, సిరియాల్లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ముప్పు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఒబామాతో కాంగ్రెస్ ‘అణు’ చర్చలు!
Published Tue, Jan 27 2015 5:31 AM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM
Advertisement
Advertisement