అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! | Obama's Taj visit a stark contrast to Eisenhower's trip | Sakshi
Sakshi News home page

అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా!

Published Fri, Jan 23 2015 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 8:05 PM

ఐషనోవర్-బరాక్ ఒబామా

ఐషనోవర్-బరాక్ ఒబామా

న్యూఢిల్లీ: ఐదు దశాబ్దాల కిందట అప్పటి అమెరికా అధ్యక్షుడు  ఐషనోవర్ తాజ్‌మహల్‌ను సందర్శించినపుడు ఉన్న భధ్రతా ఏర్పాట్లకు, ఇప్పుడు అదే అమెరికాకు అధ్యక్షుడైన బరాక్ ఒబామా అదే తాజ్‌మహల్ సందర్శనకు వస్తున్నపుడు చేపడుతున్న భద్రతా ఏర్పాట్లకు ఏ మాత్రం పొంతన లేదు. ఆగ్రాలోని ఈ చారిత్రక కట్టడాన్ని సందర్శించేందుకు వస్తున్న ఒబామాకు భద్రత కల్పించేందుకు 4,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, 100 మంది అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, బులెట్‌ప్రూఫ్ వాహనాలు, గగనతలంలో హెలికాప్టర్లతో నిఘా, యమునా నదిలో మోటార్‌బోట్లతో పహారాతో కనీవినీ ఎరుగని భత్రతా చర్యలు చేపడుతున్నారు. ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్‌మహల్ వరకూ 11 కిలోమీటర్ల దూరమంతా సీసీటీవీలను అమర్చటంతో పాటు రహదారి పొడవునా కూడళ్లలోనూ, భవనాల పైకప్పులపైనా కమాండోలనూ మోహరిస్తున్నారు. పొరుగు నగరాల నుంచి విమానాల ప్రయాణాలనూ నిలిపివేస్తున్నారు.

కానీ, 1959 డిసెంబర్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు ఐషనోవర్(1953-1961) పైకప్పు కూడా లేని ఓపెన్ కాడిలాక్ కారులో రోడ్డుకు ఇరువైపులా నిల్చుని నినాదాలు చేస్తున్న భారీ ప్రజా సమూహాలకు చేతులూపి అభివాదం చేస్తూ నాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూతో కలిసి ఇదే తాజ్‌మహల్‌ను సందర్శించారు. 'ఇద్దరు దేశాధినేతల వెంటా మరో 100 మందికి పైగా ఇతరులు కూడా ఉన్నారు. వారంతా 15 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్న నీటి ఫౌంటెన్ల పక్క నుంచి, ట్యాంకుల్లో స్వచ్ఛమైన నీటిలో అలంకరించిన పూల  పక్కగా మధ్య దారిలో నడుస్తూ సందర్శించారు. అమెరికా అధ్యక్షుడికి తాజ్ నిర్మాణ కళానైపుణ్య విశేషాలను వివరిస్తున్న నెహ్రూ మాటలను వినగలిగేంత దూరంలోనూ జనం ఉన్నారు' అని నాటి కార్యక్రమానికి హాజరైన సీనియర్ పాత్రికేయుడు ఎన్.ఆర్.స్మిత్ వివరించారు.

''నాడు ఐషనోవర్ తాజ్‌మహల్ నుంచి సర్క్యూట్ హౌస్ వద్దకు వెళ్లి,  అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిచ్‌పురి గ్రామానికి వెళ్లారు. భారతీయ గ్రామాన్ని సందర్శించాలన్న ఆయన కోరిక మేరకు సమీపంలోని లార్మ్‌దా గ్రామానికి నెహ్రూ తీసుకెళ్లారు. అక్కడి ఇరుకు రోడ్ల గుండా ప్రయాణించిన అమెరికా అధ్యక్షుడి మోటారు వాహనాల కాన్వాయ్ కొంత దూరం వెళ్లాక బురదతో నిండిన మట్టి రోడ్లపై ప్రయాణించలేకపోవడంతో అక్కడే ఆపివేశారు. గుంతలతో నిండివున్న ఆ రోడ్లపై ఐషనోవర్ కాలినడకన జాగ్రత్తగా నడుస్తూ గ్రామాన్ని సందర్శించారు. స్వల్ప సంఖ్యలో ఉన్న భద్రతా సిబ్బంది చుట్టుపక్కల గమనిస్తూ ఉంటే, అధ్యక్షుడి ఫొటోలు తీసుకోవటానికి పత్రికల ఫొటోగ్రాఫర్లు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఇళ్ల మీదకు ఎక్కారు. గ్రామంలో 300 మంది గ్రామస్థులతో సభను ఏర్పాటు చేయగా, అమెరికా అధ్యక్షుడిని వారికి నెహ్రూ పరిచయం చేశారు. ఐషనోవర్ మాత్రం కేవలం 'గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే, థాంక్యూ' అన్న నాలుగు మాటలే మాట్లాడారు'' అని ఇప్పుడు 80 ఏళ్ల వయసులో ఉన్న స్మిత్ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement