సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది. దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఈ విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఒకవేళ అవసరమైతే నేడు, రేపు కూడా ఈ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్‌వర్క్ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కానీ కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్ ట్రక్కులకు నగరంలోకి అనుమతి లేదని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు ఆపివేయాలని తెలిపింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment