odd-even policy
-
సరి-బేసి విధానంపై ప్రభుత్వానికి చురకలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం, పొగమంచు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానంతో ముందుకొచ్చింది. కానీ దీన్ని అమలు చేయడంలోనే జాప్యం జరుగుతోంది. ఈ విధానం నుంచి మహిళలను, టూ-వీలర్స్‌ను మినహాయించాలని ప్రభుత్వం కోరుతుండగా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అందరికీ ఈ పాలసీని అమలు చేయాల్సిందేనని నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ తీర్పునిచ్చింది. ఈ విషయంపై మరోసారి ఎన్జీటీని ప్రభుత్వం ఆశ్రయించగా.. మరోసారి కూడా ఢిల్లీ ప్రభుత్వ అభ్యర్థనను ఈ ట్రైబ్యూనల్ కొట్టివేసింది. మహిళలను, టూ-వీలర్స్‌ను కూడా ఈ విధానం నుంచి మినహాయించే పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. కేవలం ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీచేసింది. సరి-బేసి విధాన రోజుల్లో ట్రాన్స్‌పోర్టు సమస్యను పరిష్కరించడానికి కేవలం మహిళ కోసం బస్సులు ఎందుకు నడపడం లేదంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫోర్-వీలర్స్ కంటే టూ-వీలర్సే ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని, ఇది తెలిసి కూడా ప్రభుత్వం ఎందుకు టూ-వీలర్స్‌కు మినహాయింపు కోరుతుందో తెలియడం లేదంది. ఇదేమనా జోకా? అంటూ మండిపడింది. ఏజెన్సీ రిపోర్టుల ప్రకారం ప్రభుత్వం తన పిటిషన్లో మార్పుల కోసం తన ఫిర్యాటును విత్‌డ్రా చేసుకున్నట్టు తెలిసింది. -
సరి-బేసి విధానంతో రె'ఢీ'
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది. దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఈ విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఒకవేళ అవసరమైతే నేడు, రేపు కూడా ఈ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్వర్క్ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కానీ కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్ ట్రక్కులకు నగరంలోకి అనుమతి లేదని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు ఆపివేయాలని తెలిపింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. -
ఢిల్లీలో మరో లొల్లి
రాష్ట్రంలోని ఉన్నతాధికారుల మూకుమ్మడి సెలవు * డానిక్స్ అధికారుల ‘సస్పెన్షన్’పై నిరసన * ఆ అధికారుల సస్పెన్షన్ చెల్లదు: హోంశాఖ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో రగడ రాజుకుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఇంకో వివాదం ముదురుతోంది. ఇద్దరు డానిక్స్ అధికారులను సస్పెండ్ చేయటానికి నిరసనగా.. ఢిల్లీ రాష్ట్ర సర్కారులోని సీనియర్ అధికారులంతా గురువారం మూకుమ్మడి సెలవు పెట్టారు. ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయటం చెల్లదని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేర్కొనగా.. రాజధానిలో శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ కార్యక్రమాన్ని విఫలం చేసే కుట్రలో భాగమే అధికారుల సమ్మె అని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించింది. కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయనందుకు సస్పెన్షన్... పబ్లిక్ ప్రాసిక్యూటర్ల జీతాలు పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఫైలుపై సంతకాలు చేయటానికి ఢిల్లీ హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శులు యశ్పాల్గార్గ్, సుభాష్చంద్రలు నిరాకరించటంతో వారిని ఆప్ సర్కారు సోమవారం నాడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యకు నిరసనగా ఢిల్లీ సర్కారులోని దాదాపు 200 మంది డానిక్స్ (ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ సివిల్ సర్వీస్) కేడర్ అధికారులు గురువారం రోజంతా మూకుమ్మడి సెలవు పెట్టగా.. మరో 70 మందికి పైగా ఐఏఎస్ అధికారులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సమ్మె చేశారు. సుదీర్ఘ సెలవులో వెళితే సంతోషం: కేజ్రీవాల్ సమ్మెలో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. డానిక్స్, ఐఏఎస్ సంఘాలు బీజేపీ బీ-టీమ్ (ప్రత్యామ్నాయ బృందం)గా తయారయ్యాయని విమర్శించారు. ప్రధానమంత్రి మోదీ.. లెఫ్టినెంట్ గవర్నర్, ఇతర అధికారుల ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని ట్విటర్లో ఆరోపించారు. ‘‘వీళ్లు (ఢిల్లీ అధికారులు) సుదీర్ఘ సెలవులో వెళ్తే జనం సంతోషిస్తారు. వారికి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ’’ అని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి అమలు చేయనున్న ‘సరి - బేసి’ పథకాన్ని విఫలం చేసే కుట్ర ఇదని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. అధికారులకు సమ్మెపై వెళ్లే హక్కు లేదని.. అది వారి సర్వీసు నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. వారి సస్పెన్షన్ చెల్లదు: కేంద్ర హోంశాఖ ఇద్దరు డానిక్స్ అధికారుల సస్పెన్షన్‌పై లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సమాచారం అందిందని.. ఈ ఉత్తర్వును పొరపాటుగా లేదా మనుగడలో లేనిదిగా ప్రకటిస్తున్నామని కేంద్ర హోంశాఖ పేర్కొంది. సదరు అధికారులు ఇద్దరూ విధుల్లో ఉన్నట్లే పరిగణించాల్సి ఉంటుందని హోంశాఖ అధికార ప్రతినిధి చెప్పారు. -
‘బేసి’తో మొదలు
* వీవీఐపీలు, మహిళలకు మినహాయింపు * నేటినుంచి ఢిల్లీలో ‘సరి-బేసి’ సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘సరి-బేసి’పథకం నేటినుంచి మొదలుకానుంది. వాహనాల నెంబరు చివరన ఉన్న సంఖ్య ఆధారంగా సరి తేదీల్లో (2,4,6,8,0) సరిసంఖ్య వాహనాలను, బేసీ తేదీల్లో బేసీ సంఖ్య(1,3,5,7,9) వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు. మొదటిరోజైన శుక్రవారం బేసి సంఖ్య వాహనాలు మాత్రమే రోడ్లపైకి రానున్నాయి. ద్విచక్రవాహనాలు, మహిళలకు, వీవీఐపీలు, సీఎన్జీ వాహనాలకు ఈ విధానం నుంచి సర్కారు మినహాయింపు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో కాలుష్యం తగ్గించేంతవరకు మాత్రమే ఈ విధానం అమలుచేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ పథకం అమలు వల్ల ఢిల్లీలో 10 శాతం కాలుష్యం తగ్గుతుందని అంచనా. కాలుష్యానికి కారణమైన ట్రక్కుల (వీటికారణంగానే 46 శాతం కాలుష్యం)పైనే సర్కారు దృష్టిపెట్టింది. ప్రత్యామ్నాయం రెడీ ప్రజా రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్రో రైలు, డీటీసీ బస్సుల సేవలను విస్తృత పరిచింది. శుక్రవారం నుంచి మెట్రోరైళ్లను అదనంగా 365 ట్రిప్పులు నడుపుతున్నారు. అదనంగా 3వేల బస్సులు రోడ్డుక్కెతున్నాయి. కాగా, ఈ పరిస్థితితో తమ పంట పండినట్లేనని ఆటోవాలాలు సంబరపడుతున్నారు. అయితే ఒక కారును కేవలం 15 రోజులు మాత్రమే రోడ్లపైకి రావటం వల్ల టాక్సీ డ్రైవర్ల కుటుంబాలు వీధినపడనున్నాయి. అయితే.. ఢిల్లీ పోలీసు యంత్రాంగం కేంద్రప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. తరచూ కేంద్రంతో ఘర్షణకు దిగుతున్న కేజ్రీవాల్‌కు పోలీసులు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే. దీంతోపాటు.. వాహనదారులు కూడా ఈ విధానంపై ఓ అవగాహనకు రాలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేజ్రీవాల్ ప్రయోగం సక్సెస్ అవుతుందా అనేది అనుమానంగా మారింది.