
కారు బానెట్‌పై యువ రైతు
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండో విడతగా ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి కార్యాలయం వద్దకు వెళ్లిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది.
ఈశాన్య ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌నగర్ బ్లాక్‌కు చెందిన ప్రజలు టాయిలెట్ల నిధుల కోసం అధికారి కార్యాలయానికి వెళ్లారు. తమ సమస్యపై బీడీవో మాట్లాడాలని చెప్పగా కార్యాలయంలో ఎవరూ స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకూ ఎవరైనా వస్తారని కార్యాలయం వద్దే వేచి చూశారు.
సాయంత్రం 5 గంటల సమయంలో బీడీవో పంకజ్ కుమార్ గౌతమ్ కార్యాలయం బయటకు వచ్చి రైతుల వైపు కన్నైత్తైనా చూడకుండా వెళ్లిపోసాగారు. ఇది గమనించిన రైతులు పంకజ్ వెనుక వెళ్లగా.. ఆయన కారులో ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేశారు. అధికారి కారును అడ్డుకున్న రైతులు తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రైతుల వినతిని లెక్కచేయని అధికారి కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో రైతుల్లో కొందరు కారుకు అడ్డుతప్పుకోగా.. ఒక యువ రైతు మాత్రం అలానే అడ్డుపడి కారు బానెట్‌ను పట్టుకున్నాడు. కానీ పంకజ్ కారును ఆపకుండా అలానే నాలుగు కిలోమీటర్లు పాటు పోనిచ్చాడు. ఈ ఘటనను మొత్తం పంకజ్ తన ఫోన్‌లో వీడియో తీశాడు.
ఆ తర్వాత ఇరువురూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. పంకజ్ రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన చీఫ్ బ్లాకడెవలప్మెంట్ ఆఫీసర్ విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment