న్యూఢిల్లీ: గత 17 నెలలుగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను ప్రతినెలా పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు డిసెంబర్‌లో తాత్కాలిక విరామం ఇచ్చాయి. బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ గుజరాత్ ఎన్నికలే దీనికి కారణమనీ, ప్రభుత్వమే ఆ మేరకు చమురు సంస్థలను కోరిందని తెలుస్తోంది. వంటగ్యాస్ సిలిండర్‌లపై అన్ని రాయితీలను 2018 మార్చికల్లా ఎత్తివేయాలనీ, అందుకోసం ప్రతినెలా ధర పెంచుతూ పోవాలని కేంద్రం గతేడాది చమురు సంస్థలను ఆదేశించింది. దీంతో గతేడాది జూలై నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ప్రతి నెలా రూ.2 తో మొదలుకొని రూ.4.50 వరకు చమురు సంస్థలు సిలిండర్‌ల ధర పెంచుతూ వచ్చాయి. ఏడాదిన్నరలో రాయితీ సిలిండర్ ధర రూ.76.50 పెరిగింది. డిసెంబర్‌లో రాయితీ సిలిండర్ ధరను పెంచలేదని ఓ అధికారి చెప్పారు. రాయితీయేతర సిలిండర్ ధరను మాత్రం డిసెంబర్ 1న రూ.5 పెంచాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్ ప్రకారం 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.496, రాయితీయేతర సిలిండర్ ధర రూ.747గా ఉంది. దేశంలో 18.11 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వాటిలో 3 కోట్లు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద అత్యంత పేద మహిళలకు మంజూరైనవి.
Comments
Please login to add a commentAdd a comment