
లేటు వయసులో వికృత చేష్టలు..
థానే: గత ఆరు నెలలుగా మైనర్లను లైంగికంగా వేధిస్తున్న ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని భీవండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీవండిలోని ఖాజా మొహల్లా ప్రాంతానికి చెందిన మహమ్మద్ అస్లాం మహమ్మద్ ఖాలిక్ మోమిన్(60) స్థానికంగా నేత పని చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఇతడు పనిచేసే పవర్‌లూమ్ వద్ద కొందరు బాలికలు కూడా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా వారిని మహమ్మద్ అస్లాం తన వికృత చేష్టలతో వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబసభ్యులను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధిత బాలికలు గత ఆరు నెలల నుంచి బాధను భరిస్తూ వస్తున్నారు. అయితే, ఆ వృద్ధుడి చేష్టలతో సహనం కోల్పోయిన ఓ బాలిక ఇటీవల తన తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దీంతో వారు బుధవారం భీవండి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు మహమ్మద్ అస్లాంపై పోస్కోతోపాటు పలు సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాధితులు ఎంతమంది అనేది స్పష్టం కాలేదని, దర్యాప్తు జరిపి నిందితునిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.