శ్రీనగర్ : స్టేట్ గెస్ట్ హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉన్న జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను వారి ఇళ్లకు తరలించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్ 5న మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించినప్పటి నుంచి వీరిని స్టేట్ గెస్ట్‌హౌస్‌లో గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా ఈ వారాంతంలో ఇరువురు నేతలను వారి ఇళ్లకు తరలించే ప్రక్రియ చేపట్టవచ్చని భావిస్తున్నారు. అయితే వీరిని ఇంకా హౌస్ అరెస్ట్‌లో ఉంచుతారా లేక విడుదల చేస్తారా అనేది అధికారులు ధ్రువీకరించలేదు.
మరోవైపు ఎమ్మెల్యే హాస్టల్ నుంచి నిర్బంధంలో ఉన్న రాజకీయ నేతలు సజద్ లోన్, వహీద్ పరాలను బుధవారం విడుదల చేశారు. వీరితో పాటు సీనియర్ ఎన్‌సీ నేత అలి మహ్మద్, పీడీపీ నేత సర్తాజ్ మద్నీలను ఎమ్మెల్యే హాస్టల్ నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అధికారుల నిర్బంధంలోకి వెళ్లిన తర్వాత తొలిసారిగా జనవరి 25న బహిర్గతమైన ఒమర్ అబ్దుల్లా తెల్లని గడ్డంతో ఉన్న తొలి ఫోటో ఆయనను గుర్తు పట్టలేనంతగా ఉండటంతో నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment