ఎట్టకేలకు మాజీ సీఎం భార్య ఇల్లు ఖాళీ | Omar Abdullah’s estranged wife Payal evicted from Lutyens’ house | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు మాజీ సీఎం భార్య ఇల్లు ఖాళీ

Published Tue, Aug 23 2016 10:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ఎట్టకేలకు మాజీ సీఎం భార్య ఇల్లు ఖాళీ

ఎట్టకేలకు మాజీ సీఎం భార్య ఇల్లు ఖాళీ

న్యూఢిల్లీ: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా సోమవారం రాత్రి ప్రభుత్వ నివాసం ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కాపీతో జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి సోమవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో లుటెన్స్ జోన్ లోని పాయల్ నివసిస్తున్న బంగాళా వద్దకు వచ్చారు. గేటు తాళం తీయాలని కోరగా అక్కడ కాపలాగా ఉన్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) తిరస్కరించారు.

దీంతో ఎస్టేట్ అధికారి తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ వెళ్లి సాయం కోరారు. 4.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం కలిసి కశ్మీర్ అధికారులు బంగ్లా దగ్గరకు వచ్చారు. గేటు తాళం తీయాలని ఐటీబీపీ ఇన్ఛార్జిని మరోసారి ఎస్టేట్ అధికారి కోరారు. అయినా ఐటీబీపీ సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏసీపీకి  సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు 5.30 గంటల ప్రాంతంలో గేటు తాళం బద్దలుగొట్టి ఇంటిలోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో పాయల్ ఇంట్లో లేరు.

5.54 గంటలకు ఇంటికి వచ్చిన పాయల్ మీడియాతో  ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్లిపోయారు. ఆరున్నరకు పాయల్ తరపు న్యాయవాది అమిత్ ఖేమ్కా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పాయల్ వస్తువులను పోలీసులు బయటకు విసిరేశారని చెప్పారు. పాయల్ తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో రెండు కార్లలో తన సామానుతో పాయల్ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. 10.40 గంటలకు ఖాళీ చేసిన ఇంటికి అధికారులు కొత్త నేమ్ ప్లేట్ తగిలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement