Payal Abdullah
-
ఆ మాజీ సీఎం భార్యకు నెలకు రూ.15 లక్షలివ్వాలట
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా తాను తన బిడ్డల జీవనం కోసం నెలకు రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు మెట్లెక్కింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేసిన తర్వాత తాను పిల్లలతో సహా రోడ్డున పడ్డానని, చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా పోయిందని, తమ పోషణార్ధం నెలకు రూ.15లక్షలు ఇవ్వాల్సిందేనని ఆమె పిటిషన్లో డిమాండ్ చేశారు. అక్బర్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయించాలని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నెల రోజులకే ఆమె ఈ పిటిషన్ వేయడం గమనార్హం. నిర్వహణా ఖర్చుల కింద తనకు తన ఇద్దరు పిల్లలకు నెలకు రూ.10లక్షలు ఇవ్వాలని, కొత్తగా ఓ నివాసంలో ఉండేందుకు నెలకు రూ.5లక్షలు ఇవ్వాలని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పాయల్ తల్లిదండ్రుల దయ వల్ల ఆమె స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నారని, వారి జీవితం చాలా దుర్భరంగా ఉందని పిటిషన్లో చెప్పారు. గతంలో తమకు జెడ్ జెడ్ ప్లస్ కేటగిరి కింద రక్షణ ఉండేదని, ఇప్పుడది కాస్త పోవడంతో భద్రతకు కూడా భంగం ఏర్పడిందని చెప్పారు. అయితే, దీనిపై బదులు ఇవ్వాల్సిందిగా నగరంలోని ఫ్యామిలీ కోర్టు ఒమర్ కు నోటీసులు పంపించింది. కేసు విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. -
ఎట్టకేలకు మాజీ సీఎం భార్య ఇల్లు ఖాళీ
న్యూఢిల్లీ: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లా సోమవారం రాత్రి ప్రభుత్వ నివాసం ఖాళీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల కాపీతో జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి సోమవారం సాయంత్రం 4.10 గంటల ప్రాంతంలో లుటెన్స్ జోన్ లోని పాయల్ నివసిస్తున్న బంగాళా వద్దకు వచ్చారు. గేటు తాళం తీయాలని కోరగా అక్కడ కాపలాగా ఉన్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) తిరస్కరించారు. దీంతో ఎస్టేట్ అధికారి తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్ వెళ్లి సాయం కోరారు. 4.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు, మున్సిపల్ యంత్రాంగం కలిసి కశ్మీర్ అధికారులు బంగ్లా దగ్గరకు వచ్చారు. గేటు తాళం తీయాలని ఐటీబీపీ ఇన్ఛార్జిని మరోసారి ఎస్టేట్ అధికారి కోరారు. అయినా ఐటీబీపీ సిబ్బంది వినిపించుకోలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు ఏసీపీకి సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు 5.30 గంటల ప్రాంతంలో గేటు తాళం బద్దలుగొట్టి ఇంటిలోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో పాయల్ ఇంట్లో లేరు. 5.54 గంటలకు ఇంటికి వచ్చిన పాయల్ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే లోపలికి వెళ్లిపోయారు. ఆరున్నరకు పాయల్ తరపు న్యాయవాది అమిత్ ఖేమ్కా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పాయల్ వస్తువులను పోలీసులు బయటకు విసిరేశారని చెప్పారు. పాయల్ తో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాత్రి 10.20 గంటల ప్రాంతంలో రెండు కార్లలో తన సామానుతో పాయల్ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారు. 10.40 గంటలకు ఖాళీ చేసిన ఇంటికి అధికారులు కొత్త నేమ్ ప్లేట్ తగిలించారు. -
ఒమర్ అబ్దుల్లా మాజీ భార్యకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాల్సిందేనని ఆమెను పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం ఆదేశించింది. ఢిల్లీలో ఆమె నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లాలని జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి ఇచ్చిన నోటీసును రద్దుచేయాలని పాయల్ పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు 7లో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని జూన్ 30న ఆమెకు నోటీసు ఇచ్చారు. ఒమర్, పాయల్ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2011, సెప్టెంబర్ లో విడిపోయారు.