అధికార పీఠాల్లో మార్పులు | Gujarat firm gets contract to revamp Central Vista, Parliament | Sakshi
Sakshi News home page

అధికార పీఠాల్లో మార్పులు

Published Fri, Jan 17 2020 4:45 AM | Last Updated on Fri, Jan 17 2020 12:18 PM

Gujarat firm gets contract to revamp Central Vista, Parliament - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పునః అభివృద్ధి ప్రణాళిక వివరాలు ఒక్కటొక్కటిగా వెల్లడవుతున్నాయి. శతాబ్దాల చరిత్రగల ల్యూటెన్స్‌ ఢిల్లీలో సరికొత్త పార్లమెంటు భవనంతోపాటు సెంట్రల్‌ సెక్రటేరియట్, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది డిజైన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హెచ్‌సీపీ డిజైన్స్‌ అనే గుజరాతీ సంస్థ డిజైన్, కన్సల్టెన్సీ, ఇంజినీరింగ్‌ ప్లానింగ్‌ హక్కులు సాధించుకుంది. మొత్తం ప్రాజెక్టు ఫీజు రూ. 229.75 కోట్లు కాగా.. నిర్మాణ వ్యయం రూ. 12,879 కోట్లు అని అంచనా.

హెచ్‌సీపీ సంస్థ మాస్టర్‌ ప్లాన్‌తోపాటు డిజైన్లు, నిర్మాణ వ్యయం, ల్యాండ్‌స్కేపింగ్, ట్రాఫిక్, పార్కింగ్‌ వంటి అంశాలపై నివేదిక ఇవ్వనుంది. ఈ మెగా ప్రాజెక్టుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...సెంట్రల్‌ విస్టా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నివాసాన్ని, కార్యాలయాన్ని సౌత్‌బ్లాక్‌కు దగ్గరగా మార్చనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి కోసం నార్త్‌ బ్లాక్‌ పరిసరాల్లో కొత్తగా ఒక ఇంటిని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నివాసం ఉన్న భవనాన్ని కూల్చి వేయనున్నారు. రాష్ట్రపతి భవన్, ఇండియాగేట్‌ల మధ్య ఉన్న మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్‌లో కొత్త నిర్మాణాలు జరపాలన్నది హెచ్‌సీపీ ప్రణాళిక.

ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే త్రికోణాకారంలో ఉండే సరికొత్త పార్లమెంటు భవనం, సెంట్రల్‌ సెక్రటేరియట్లు ఇక్కడ నిర్మాణమవుతాయి. స్వాతంత్య్రం 75వ వార్షికోత్సవాల సందర్భంగా అంటే 2022 ఆగస్టు నాటికి కొత్త పార్లమెంటు భవనాన్ని సిద్ధం చేయాలన్నది లక్ష్యం. కామన్‌ సెక్రటేరియట్‌ను 2024 నాటికల్లా అందుబాటులోకి తెస్తారు. ప్రధాని, ఉప రాష్ట్రపతి ఇళ్లను సౌత్, నార్త్‌ బ్లాక్‌లకు దగ్గరగా మార్చడం వల్ల వీఐపీల కోసం ట్రాఫిక్‌ను ఆపాల్సిన అవసరం తగ్గనుంది. పైగా ప్రధాని ఇల్లు, కార్యాలయం దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధాని ఇంటి నుంచి కార్యాలయానికి నడిచి వెళ్లేందుకూ అవకాశం ఉంటుంది.

8 భవనాలుగా సెంట్రల్‌ సెక్రటేరియట్‌..
కొత్త సెంట్రల్‌ సెక్రటేరియట్లో.. సెంట్రల్‌ విస్టాకు ఇరువైపులా నాలుగు భవనాల చొప్పున మొత్తం ఎనిమిది భవనాలు ఉంటాయి. ఒక్కో భవనంలో ఎనిమిది అంతస్తుల్లో వేర్వేరు మంత్రిత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటవుతాయి. మంత్రిత్వశాఖల్లో సుమారు 25 నుంచి 32 వేల మంది ఉద్యోగులు ఢిల్లీలో వేర్వేరు ప్రాంతాల్లో పని చేస్తున్నారు. ఆయా శాఖల కార్యాలయాల కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు అద్దెల కోసమే చెల్లిస్తున్నట్లు అంచనా. సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణం పూర్తయితే అద్దె ఆదా అవడమే కాకుండా ఉద్యోగులందరూ ఒకే చోట పనిచేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement