అసహనంపై ఉమ్మడి పోరు: మన్మోహన్
గాంధీనగర్: అసమానత, అసహనం నుంచి ప్రపంచానికి విముక్తి కోసం విద్యార్థులు విధాన నిర్ణేతలతో కలసి పనిచేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. ఆయన శనివారమిక్కడ ‘బాపు గుజరాత్ నాలెడ్జ్ విలేజ్’లో భావిభారతంలో విద్యార్థుల పాత్రపైప్రసంగించారు. భవిష్యత్తుపై యువత ఎంతో ఆశావాద దృక్పథంతో ఉందని, పేదరికం, నిరుద్యోగం, అసమానత, అసహనం నుంచి ప్రపంచం విముక్తి పొందాలని కోరుతోందని చెప్పారు. ఈ మార్పులు సాధ్యం కావాలంటే విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ముందుండి నడిపించే నాయకులతో చేతులు కలపాలన్నారు.
అసహనంపై అప్రమత్తమవ్వాలి: బాన్‌కీ మూన్
న్యూయార్క్: ప్రపంచంలో పెరిగిపోతున్న అసహనం, విద్వేషపూరిత హింసాకాండపై అప్రమత్తమవ్వాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ పిలుపునిచ్చారు. ఇస్లాం వ్యతిరేక దురభిమానం తదితర విద్వేషాలపై అంతర్జాతీయ సమాజం గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ జాత్యహంకార వివక్ష నిర్మూలన దినం సందర్భంగా ఇక్కడ జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.