
'రాష్ట్రపతి పాలన పెట్టాలనుకుంటున్నారు'
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆమ్ఆద్మీపార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అలా విధించేందుకు ఢిల్లీలో మున్సిపల్ కార్మికుల సమ్మెను సాకుగా ఉపయోగించుకోవాలనుకుంటుందని చెప్పారు. చాలా రోజులుగా వేతనాల చెల్లింపుల కోసం బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన కార్మికులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వీరు తమ విధులను పక్కకు పెట్టడంతో ఢిల్లీలో చెత్త పేరుకుపోయింది.
ఫలితంగా ఆప్ మంత్రులే ఈ మధ్య మున్సిపల్ కార్మికుల అవతారం ఎత్తి వీధులు శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ 'మోదీ ప్రభుత్వం ఢిల్లీలో కూడా అరుణాచల్ ప్రదేశ్లో మాదిరిగా రాష్ట్రపతి పాలన విధించాలని అనుకుంటుంది' అని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న పలు శాఖల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, తమ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు ఎలాంటి బాకీ లేదని, వారి జీతభత్యాలు తాము చెల్లిస్తునే ఉన్నామని అన్నారు.