సాక్షి, ముంబై: ఈ ఏడాది వినాయక చవితికి నగరంలో ఏర్పాటుచేయనున్న గజానన్ విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించరాదని బృహన్ ముంబై సార్వజనిక్ గణేషోత్సవ్ సమన్వయ సమితి (బీఎస్‌జీఎస్‌ఎస్) కోరింది. ఈ సమితి నగరంలో దాదాపు 1,400 మండళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎత్తు ఎక్కువ ఉన్న విగ్రహాల తరలింపు చాలా కష్టంతో కూడుకున్నదని, కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఆ సమితి పేర్కొంది. నగరంలో చాలా చోట్ల రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉంటున్నాయని, విగ్రహాల సమయంలో వీటిలో వాహనం దిగబడితే ప్రమాదాలు జరిగి ప్రాణనష్టానికి ఆస్కారమున్నందున ఈసారి విగ్రహాలను 18 అడుగులకు మించి ఏర్పాటుచేయరాదని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా పర్యావరణానికి ఎలాంటి చేటు కలగకుండా ప్రభుత్వం గణేష్ మండళ్లకు విగ్రహాల తయారీ కోసం క్లేను అందచేయాల్సిందిగా బీఎస్‌జీఎస్‌ఎస్ కోరింది.
ఇటీవల గణేష్ మండళ్ల ప్రతినిధులతో బీఎస్‌జీఎస్‌ఎస్ అధ్యక్షుడు నరేష్ దహిబావ్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రతిపాదనలు చేశారు. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులుగా క్లేను ఉపయోగించుకోవాల్సిందిగా మండళ్లను కోరారు. ప్రతి ఏడాది నగరంలో దాదాపు 1.8 లక్షల విగ్రహాల తయారీ జరుగుతోంది. వీటన్నింటిని క్లే ఉపయోగించి తయారు చేసినట్లయితే నీటి కాలుష్యాన్ని నివారించినవారమవుతామన్నారు. అంతేకాకుండా ఈసారి తాము విగ్రహాల ఎత్తు 18 అడుగుల కంటే కూడా మించరాదని పరిమితి విధించామన్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు ఉండడంతో భారీ విగ్రహాలను తరలించే సమయంలో ప్రమాదాలు చోటుచేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. విగ్రహాల ఎత్తును తగ్గించమని గత ఏడాదిలోనే తాము అన్ని మండళ్లకు వివరించామని దహిబావ్కర్ తెలిపారు.
కాగా, లాల్‌బాగ్ సార్వజనిక్ గణేషోత్సవ్ మండల్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ఆ మండల్ కార్యదర్శి స్వప్నిల్ పరబ్ మాట్లాడుతూ.. తమ మండల్ ఎన్నో యేళ్లుగా 20 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ గణేషుడ్ని చూడటానికి భక్తులు వస్తారు కాబట్టి ఈ ఏడాది కూడా 20 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
18 అడుగుల విగ్రహాలు చాలు..
Published Wed, Jul 2 2014 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement