మరోసారి జాట్ల జగడం
మరోసారి జాట్ల జగడం
Published Sun, Jun 5 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM
చండీగఢ్: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ జాట్ కులస్తులు ఆదివారం నుంచి మరోసారి భారీ ఉద్యమబాట పట్టారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని హరియాణా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భద్రత కోసం 20 వేల మంది జవాన్లను మోహరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జాట్ల ఉద్యమం సందర్భంగా హరియాణాలో పెద్ద ఎత్తున విధ్వంసం, ప్రాణనష్టం జరిగింది. ఉద్యమానికి కేంద్రమైన రోహ్తక్ జిల్లాలోని జస్సియా గ్రామంలో ఆదివారం హవనం నిర్వహించడం ద్వారా జాట్లు మరోసారి ఆందోళనలను మొదలుపెట్టారు. అఖిల భారత జాట్ రిజర్వేషన్ సంఘర్షణ సమితి (ఏఐజేఏఎస్ఎస్) నేతృత్వంలో వందలాది మంది రోహతక్-పానిపట్ హైవేపై టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేసింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలు విధించామని అధికారులు ప్రకటించారు. పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి కొన్ని జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లను నిషేధించారు. తొలి రోజు చాలా చోట్ల జాట్ల కార్యక్రమాలు జరిగినప్పటికీ తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదని పోలీసులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో తమ ఉద్యమాలు కొనసాగుతున్నాయని జాట్లు ప్రకటించారు. ‘మేం శాంతియుతంగా ధర్నాలు చేస్తాం. జాట్లకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఇది వరకు ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలి. ఆందోళనల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం అందజేయాలి’ అని ఉద్యమ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రోహ్తక్, సోనెపట్, భివానీ, హిస్సార్, జింద్, కైతాల్, ఝజ్జర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు, పోలీసులు కవాతులు నిర్వహిస్తున్నారు. హైవేలు, రైలుపట్టాలను జాట్లు ధ్వంసం చేసే అవకాశాలు ఉండడంతో పటిష్ట నిఘా ఉంచారు. ఫిబ్రవరిలో జరిగిన ఆందోళనల్లోనూ జాట్లు హైవేలు, రైల్వేమార్గాలను మూసివేయడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. ఢిల్లీకి నీటి సరఫరా చేసే మునాక్ కాలువను మూసివేశారు. ఈసారి అటువంటి పరిస్థితిని నివారించడానికి కాలువ వెంట పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాలను మోహరించారు. జాట్లు ధర్నాలు చేసుకోవడానికి స్థలాలను ఏర్పాటుచేశామని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హోంశాఖ అదనపు కార్యదర్శి రామ్ నివాస్ ప్రకటించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి చండీగఢ్ లో కంట్రోల్ రూముల్ని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తామని జాట్లు తనకు హామీ ఇచ్చారని ప్రకటించారు. ఫిబ్రవరిలో జాట్ల ఆందోళనల సందర్భంగా పలు చోట్ల హింస, దోపిడీలు జరగడమేగాక, 30 మంది మరణించారు.
Advertisement
Advertisement