
బాక్స్ అని తెరిస్తే బాంబై పేలింది
గువాహటి: అసోంలోని ఓ గ్రామంలో బాంబు పేలుడు చోటుచేసుకొని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు వివరాల ప్రకారం ఉదలగురి జిల్లాలోని బోర్జాహర్ గ్రామంలో రామ్ చంద్ర బర్మాన్ అనే వ్యక్తి పాత వస్తువుల కొనుగోలు డీలర్గా పనిచేస్తున్నాడు. అతడు శనివారం సేకరించిన పాత వస్తువుల్లో భాగంగా బాక్స్లాంటి వస్తువు ఒకటి వచ్చింది. అది బాంబు అని గుర్తించని రామ్చంద్ర ఆదివారం ఉదయం 6.30గంటల ప్రాంతంలో సుత్తితో కొడుతూ దానిని తెరిచే ప్రయత్నం చేశాడు. దాంతో అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఇంట్లోని ఓ మహిళతో సహా ముగ్గురు గాయపడ్డారు.