గుజరాత్‌లో కొనసాగుతున్న ఆందోళనలు
అహ్మదాబాద్ : ఈ నెల 11న ఉనా పట్టణంలో దళిత యువకులపై జరిగిన దాడికి నిరసనగా గుజరాత్‌లో ఆందోళనల పరంపర బుధవారం కూడా కొనసాగింది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దళిత సంఘాల బంద్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు.
పలుచోట్ల బస్సులను ధ్వంసం చేశారు. సురేంద్రనగర్ జిల్లాలో రైలును సైతం నిలిపివేశారు. బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌లలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా బంద్ పాటించాయి. సీఎం ఆనందీబెన్‌పటేల్ రాజ్‌కోట్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.