
కొనసాగుతున్న నిరసనల పర్వం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై బుధవారం కూడా
దేశవ్యాప్తంగా వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆందోళనలు
స్మృతీ, దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలని డిమాండ్
కోల్‌కతా/హిసర్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యపై బుధవారం కూడా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ యువజన విభాగాలు వేర్వేరుగా ఆందోళనలు చేశాయి. కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. హర్యానాలోని హిసర్‌లో పలు దళిత సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలకు దిగారు. హెచ్‌సీయూలో ఘటనలను ఖండిస్తూ హిసర్‌లోని మినీ సెక్రటేరియట్ ఎదుట నిరసన తెలిపారు. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మృతి, దత్తాత్రేయలను పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇక కొయంబత్తూర్‌లోనూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాలు నిరసన చేపట్టాయి. దీంతో 23 మంది విద్యార్థులను పోలీ సులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని మధురలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదైన కేంద్ర మంత్రి దత్తాత్రేయను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
న్యాయపర చర్యలు తీసుకోవాలి: మాయావతి
లక్నో/పట్నా/న్యూఢిల్లీ: హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, దత్తాత్రేయలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. వర్సిటీ వీసీ అప్పారావుపైనా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దళిత విద్యార్థి అయిన రోహిత్‌పై కేంద్ర మంత్రులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని, గర్హనీయమని అన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై వాస్తవాలను వెలికి తీసేందుకు ఒక నిజనిర్థారణ కమిటీని హైదరాబాద్ పంపనున్నట్టు ఆమె వెల్లడించారు.
మరోవైపు రోహిత్ మరణానికి సంబంధించి స్మృతీ ఇరానీపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ మౌనం వీడాలని, ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దత్తాత్రేయను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయలని, వర్సిటీ వీసీని తొలగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దీపిందర్‌సింగ్ హుడా న్యూఢిల్లీలో డిమాండ్ చేశారు. అటు రోహిత్ మరణంపై బిహార్ సీఎం నితీశ్‌కుమార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో ఉన్న వాతావరణం అసహనం పెరుగుతోందనడానికి సూచనగా ఉందన్నారు. ఒక దళిత విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడంటే దేశంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్మృతీ, దత్తాత్రేయలపై మండిపడ్డారు. రోహిత్ మృతికి వారిద్దరే కారణమని ఆయన బెంగళూరులో ఆరోపించారు.