
మోదీ ఒక్కరే చేయగలరు!
కశ్మీర్ సమస్యకు పరిష్కారంపై మెహబూబా
► మోదీ మాటకు దేశమంతా మద్దతిస్తోందని ప్రశంస
జమ్మూ/న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్ సమస్యకు పరిష్కారం సూచించే వ్యక్తి ప్రధాని మోదీ ఒక్కరేనని జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా అన్నారు. బలమైన ప్రజామోదం ఉన్న మోదీని లోయను సమస్యల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావాలని ఆమె కోరారు. లోయలో శాంతి నెలకొల్పేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలును కొనసాగించటంలో యూపీఏ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు.
‘నేను మనస్సాక్షిగా ఓ విషయం చెబుతున్నా. ఇందుకు నాపై విమర్శలు రావొచ్చు. జమ్మూకశ్మీర్ సమస్యకు ఎవరైనా పరిష్కారం చెప్పగలరు అనుకుంటే అది ప్రధాని మోదీ ఒక్కరే. ఆయనకు బలమైన ప్రజామోదం ఉంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దేశమంతా మద్దతుగా ఉంటుంది’ అని అన్నారు. అందుకే తమను విషమపరిస్థితుల్లోంచి బయటపడేయాలని ప్రధానిని ఆమె కోరారు.
జమ్మూలో ఓ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మెహబూబా మాట్లాడుతూ.. ‘ప్రజామోదమే బలమైన శక్తి. ఆయన లాహోర్ వెళ్లారు. ఆ దేశ ప్రధానిని కలిశారు. ఇది ఆయనకు బలహీనత కాదు. బలమైన శక్తికి సంకేతమది’ అని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్‌కు పాక్‌లో పర్యటించే ధైర్యమే ఉండేది కాదన్నారు. ‘మాజీ ప్రధానికి పాకిస్తాన్ వెళ్లాలని.. తన పూర్వీకుల ఇంటిని చూడాలని ఉండేది. కశ్మీర్ సమస్యపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలని ఆయన కూడా అనుకున్నారు. అందుకు అవసరమైన ధైర్యమే ఆయనకు లేదు’ అని మెహబూబా వెల్లడించారు.
వాజ్‌పేయి–సయీద్ హయాంలో..
కశ్మీర్‌లో 2002ను శాంతి అధ్యాయంగా పేర్కొన్న మెహబూబా.. అప్పటి ప్రధాని వాజ్‌పేయి, సీఎం ముఫ్తీ సయీద్‌లకే ఈ ఘనత దక్కుతుందన్నారు. ‘సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ.. ఎల్‌కే అడ్వాణీ పాక్‌తో చర్చలు జరిపారు. అప్పుడే వాస్తవాధీన రేఖ వెంట ఇరు ప్రాంతాలను కలిపే రోడ్లను తెరవాలన్న ప్రతిపాదనకు అంతా సిద్ధమైంది’ అని తెలిపారు.